ఉమ్మడి జిల్లాలో మారనున్న రిజర్వేషన్లు.. ఆశావహుల్లో మొదలైన ఆందోళన !
స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు మారనుండటంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది...
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు మారనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆశావాహు డైలమాలో పడిపోయారు. పదేండ్లపాటు రిజర్వేషన్లు అమలులో ఉండేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఆ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం ఒక దఫా రిజర్వేషన్లు అమలైన నేపథ్యంలో.. మరో మారు అవే రిజర్వేషన్లు ఉండవచ్చని ఆశావహులు ఆశించారు. ఈ మేరకు ఆశావహులు, వారు పోటీ చేయదలచుకున్న స్థానాలపై దృష్టి సారించి పనులు చేస్తూ వచ్చారు.
రాజకీయాల మార్పుతో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదేండ్ల సంవత్సరాలపాటు బిఆర్‌ఎస్ హవా కొనసాగిన విషయము పాఠకులకు విధితమే..! ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వ్యూహరచనలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏర్పడుతున్న వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాల నేతలు మరోవైపు అంచనా వేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పార్టీ నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నారు.
స్థానిక సంస్థల అన్నింటిలోనూ మార్పులు..
వచ్చే స్థానిక సంస్థలు అన్నింటిలోనూ రిజర్వేషన్లు మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ తో పాటు, మున్సిపాలిటీల వార్డులు, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో సైతం రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో తాము పోటీ చేయదలచుకున్న స్థానం ఎక్కడ రిజర్వేషన్ అవుతుందో.. అన్న భయంతో ఆశావహులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించిన అనంతరం తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటివరకు ఉంటాయి అనుకున్న రిజర్వేషన్లు అన్ని మారుతుండడంతో రాజకీయాలలోనూ పలు మార్పులు చేర్పులు ఉంటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పెరుగనున్న స్థానాలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా మరికొన్ని స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఆయా మున్సిపాలిటీలలోనూ వార్డు మెంబర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.