Collector Santosh : సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్య సేవలందించాలి

సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్య

Update: 2024-08-14 12:10 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు వైద్య సేవలు సమీక్షించారు. డయాగ్నొస్టిక్ సెంటర్ , బ్లడ్ బ్యాంక్ , మెడికల్ స్టోర్ రూమ్ ను పరిశీలించారు. డయాగ్నొస్టిక్ సెంటర్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి పంపిస్తున్న శాంపిల్స్‌, విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా కేసులపై కలెక్టర్‌ ఆరా తీశారు. ప్రతి రోజు ఎంత మంది రోగులు వస్తున్నారు, వారికి వైద్యం, వైద్య పరీక్షలు ఎలా అందిస్తున్నారు, ఎంత మంది మెరుగయ్యారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...వైద్య సేవల కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలను పారదర్శకంగా అందించాలని అన్నారు.

ప్రజలకు అన్ని రకాల మెడికల్, డయాగ్నోస్టిక్ టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. రాపిడ్ టెస్ట్ చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. బ్లడ్ బ్యాంక్‌లో డెంగ్యూ రోగులకు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే ఎస్‌డీపీ (సింగిల్‌డోనర్‌ ప్లేట్‌లెట్‌) మిషన్‌ను పరిశీలించి, యంత్రాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకునిరావాలన్నారు. అనంతరం ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. మందుల స్టాక్ రిజిస్టర్ వివరాలను, అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సిద్దప్ప, హాస్పిటల్ సూపరింటెండెంట్ వినోద్, పాథాలజిస్ట్ డాక్టర్ చైతన్య, ఫార్మసిస్ట్ వెంకటస్వామి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News