సోమశిల నుంచి శ్రీశైలానికి కదిలిన లాంచి.. 80 మందితో ప్రయాణం..
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమశిల నుంచి శ్రీశైలానికి శనివారం ఉదయం 11 గంటలకు క్రూజ్ లాంచీలో 80 మంది పర్యాటకులతో బయలుదేరింది.
దిశ, కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమశిల నుంచి శ్రీశైలానికి శనివారం ఉదయం 11 గంటలకు క్రూజ్ లాంచీలో 80 మంది పర్యాటకులతో బయలుదేరింది. పర్యాటక శాఖ బ్రాంచ్ మేనేజర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణమైంది. ఈ లాంచీలో సీట్ల సామర్థ్యం 120 మంది కాగా శనివారం మాత్రం 80 మందితో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీశైలానికి ఈ లాంచీ ప్రయాణం తొలిసారి. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీలో 90 కిలోమీటర్ల ప్రయాణం.
అయితే ఈ లాంచీ ఆదివారం సాయంత్రం తిరిగి సోమశిలకు చేరుకుంటుంది. అయితే ఈ లాంచీలో ఇద్దరు డ్రైవర్లతో వెళ్లిన 80 మంది పర్యాటకులకు మార్గమధ్యంలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం కల్పించనున్నారు. ఆంధ్ర పాపి కొండలకు దీటుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నల్లమల పాపి కొండలు ప్రకృతి అందాలను ఆరబోసిన దృశ్యాలను పర్యాటకుల హృదయాలను కట్టిపడేస్తాయి. కృష్ణమ్మ అలల పై చల్లటి గాలులలో లాంచీలో చేసే ప్రయాణం పర్యాటకులకు జీవితంలో మరపురాని ఘట్టమని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ సోమశిల కృష్ణానది అలలు, నల్లమల ప్రకృతి అందాలు తెలంగాణకు సోమశిల పర్యాటక కేంద్రం మరో ఊటీని తలపించనుంది.