కరువు తీరా.. అభివృద్ధికి ఆశలు..నేడు సొంతగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

తరతరాలుగా.. ఈ జిల్లా అంటే.. చిన్న చూపు.. వాళ్లకు ఓట్లు

Update: 2024-11-30 02:35 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: తరతరాలుగా.. ఈ జిల్లా అంటే.. చిన్న చూపు.. వాళ్లకు ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కానీ అభివృద్ధి మాత్రం వాళ్ల ప్రాంతాలలోనే జరగాలి అన్నట్లుగా ఉండిపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా పరిస్థితి. పక్కనే కృష్ణ.. తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న సాగునీటికి తాగునీటికి నోచుకోలేని పరిస్థితులు వెంటాడే కరువు కాటకాలనుంచి బయటపడేందుకు వలసల బాట పట్టారు. కన్నీటి గోసతో సాగుతున్న బతుకులను బాగు చేస్తామంటూ ప్రగల్భాలు పలికి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి.. ఈ ప్రాంతాన్ని కాక వారి సొంత ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్న వారు కొందరైతే.. మరి కొంతమంది తప్పని పరిస్థితులలో కొంత అభివృద్ధి చేశారే తప్ప.. కరువు తీర్చలేదు.. వలసలు ఆపలేదు.. ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయితే.. కాదు కాదు.. ఈ నాయకుడు ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరుతాయని ఎదురుచూసిన పాలమూరు ప్రజలకు ఎప్పుడు అడియాసలే మిగిలాయి.

ఈ ప్రాంత కష్టాలు తెలిసినవాడు, ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయితే.. ఉమ్మడి పాలమూరు జిల్లా కష్టాలు తీరుతాయని నమ్మి.. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలలో ఈ జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 14స్థానాలలో ఏకంగా 12స్థానాలను గెలిపించి ఇచ్చారు. ఇప్పటికే పలు సందర్భాలలో ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన, పెండింగ్ ప్రాజెక్టులు.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు గడ్డన జరుగుతున్న రైతు పండగ కార్యక్రమానికి హాజరవుతుండడంతో.. ఈసారి స్పష్టమైన హామీలు ఇచ్చి వాటిని పూర్తి చేస్తారని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం.. జనం ఆశిస్తున్నారు

పాలమూరు-రంగారెడ్డి పైనే ఆశలు

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును మూడేండ్ల పూర్తిచేసి కృష్ణమ్మ జలాలతో ఈ ప్రాంత రైతుల పాదాలు కడుగుతామని పదేపదే చెబుతూ వచ్చారు. కారణాలు ఏవైనా 8 ఏండ్లు దాటిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. అచ్చంపేట, గద్వాల, అలంపూరు ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన ఎత్తిపోతల హామీలు, ఉత్తిపోతలుగా మిగిలాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం.. స్పష్టమైన హామీలు ఇచ్చి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతారన్న నమ్మకాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తే, ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా 10 నుంచి 11లక్షల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంటుంది.

కాగా, సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రారంభమయ్యే రైతు పండుగ సభను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే భారీ ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాట్లు, రంగుల విద్యుత్ దీపాలు, దారుల పొడవున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మూడున్నర గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. నాలుగున్నర గంటల నుండి 6 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై ప్రజలకు హామీల వర్షం గుప్పించనున్నారు.


Similar News