మళ్లీ సారొస్తున్నారు.. నేడు నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ సభలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలోని నాలుగు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలోని నాలుగు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అలంపూర్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే బహిరంగ సభలకు కేసీఆర్ హాజరు అవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రెండు ధపాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే జడ్చర్ల, అచ్చంపేట, దేవరకద్ర,వనపర్తి,గద్వాల,మక్తల్,నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు హాజరై పార్టీ శ్రేణులలో జోష్ తెచ్చారు. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రచార సభలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
పరిస్థితులు మెరుగుపడేనా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు నియోజకవర్గాలు మినహాయిస్తే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. సీఎం పర్యటించే నాలుగు నియోజకవర్గాలలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు అంచనాలు ఉండగా.. కల్వకుర్తి, అలంపూర్ నియోజకవర్గాలలో వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. స్థానికంగా ఉండే పరిస్థితులు, పలువురు ముఖ్య నేతల పార్టీల మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాలలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థులకు సవాలుగా మారుతున్న ఎన్నికలు
అధికార బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ గా మారుతున్నాయి. ఎలాగైనా తిరిగి గెలవాలన్న సంకల్పంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలంగా వేస్తున్న కాంగ్రెస్ పవనాలను తట్టుకొని ఏ మేరకు విజయం సాధిస్తారన్న అంశం తేలవలసి ఉంది. కాగా ఆదివారం జరగనున్న ఎన్నికల ప్రచార సభలతో ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ అభ్యర్థులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో జరిగే ఈ సభలకు ఆయన నియోజకవర్గాల అభ్యర్థులు 75 నుంచి లక్ష మంది జనంతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
పర్యటన ఇలా సాగనుంది..
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. ముందుగా ఆయన అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అటు నుంచి కొల్లాపూర్ కు చేరుకొని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారథ్యంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు.అక్కడి నుంచి కల్వకుర్తిలో జరిగే సభలోను సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.