సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్..

గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

Update: 2024-10-19 09:36 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం సంగాల పార్క్ వద్ద జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ తోట శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి సీఎం కప్ -2024 టార్చ్ ని వెలిగించి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. టార్చ్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో యువత హాజరై సంగాల పార్క్ నుండి గద్వాల కలెక్టరేట్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె నుంచి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కప్ 2024 పై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ర్యాలీ నిర్వహిస్తుందని అన్నారు. తెలంగాణ నుండి ఒలింపిక్స్ వంటి పోటీలకు క్రీడాకారులు ఎంపిక కావాలంటే గ్రామస్థాయిలోనే టాలెంట్‌ను గుర్తించడం అవసరమని పేర్కొన్నారు. సీఎం కప్ కార్యక్రమం ద్వారా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మంచి నైపుణ్యత పొందిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో, అంత రాష్ట్రస్థాయిలో ఒలింపిక్స్ లో వెళ్లే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇటీవల ఒలింపిక్స్ లో పాల్గొన్న నిఖిత జరీన్, టీ20 క్రికెట్ వరల్డ్ కప్ విజేత మహమ్మద్ సిరాజ్ వంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ స్థాయిలో నియామకాలు చేస్తారన్నారు. క్రీడలు ఇప్పుడు కేవలం ఆటలు మాత్రమే కాకుండా, ఒక ప్రొఫెషనల్ కెరీర్ గా మారుతాయన్నారు. మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, క్రీడలు వ్యక్తి ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల వలన శారీరక ఆరోగ్యంతో పాటు, మానసికంగా దృఢంగా ఉంటామన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలు ఒక వ్యక్తి శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారికి పోలీస్ శాఖలో ప్రవేశించడం సులభం, ఎందుకంటే శారీరక ఆరోగ్యం, మానసిక బలాన్ని కలగలిపితేనే ఈ రంగంలో సవాళ్లను అధిగమించగలమని అన్నారు. సీఎం కప్ ద్వారా గ్రామస్థాయి నుంచి ఎంపికవుతున్న యువ క్రీడాకారులు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గెలుపొందే అవకాశాలను పొందేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్-2024 ప్రధానంగా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో క్రీడలో ప్రతిభావంతులను గుర్తించి, ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లో ప్రతి క్రీడాకారుడికి తగిన అవకాశాలు పొందేలా చేస్తాయని అన్నారు. రాష్ట్రస్థాయిలో జరగబోయే పోటీలలో గద్వాల చెందిన క్రీడలు క్రీడాకారులు సెలెక్ట్, అలాగే రాష్ట్రం నుండి ఒలంపిక్ లో జరగబోయే క్రీడల్లో కూడా గద్వాల ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎంపిక కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, బెటాలియన్ డీఎస్పీ రఘునాథ్ చౌహాన్, జిల్లా క్రీడా అధికారి బియస్ ఆనంద్, అధికారులు, క్రీడాకారులు, పాల్గొన్నారు.


Similar News