మూడుతరాల ఉద్యమశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల ఉద్యమశీలని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన చూపించిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

Update: 2024-09-27 12:43 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల ఉద్యమశీలని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన చూపించిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన ఎనలేని సేవలను స్మరించుకున్నారు.

    తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సాయుధ పోరాటం నుంచి రాజకీయ పోరాటం వరకు తన త్యాగస్ఫూర్తిని చాటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన పట్టుదల, విశ్వాసం, తపన తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన మార్గం, విలువలు అందరికీ స్పూర్తిదాయకం కావాలని కోరారు. ఆయన ఆశయాల కోసం, జిల్లా అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఏఓ వీరభద్రప్ప, జెడ్పీ సీఈఓ కాంతమ్మ ,ఇంచార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సరోజమ్మ, జిల్లా అధికారులు, కలెక్టరేట్​ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Similar News