ఉమా మహేశ్వర ఆలయానికి చేరిన 'అచ్చంపేట' పంచాయతీ
ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకు వేడి ఎక్కుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో పట్టు వేధిస్తుండడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకు వేడి ఎక్కుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో పట్టు వేధిస్తుండడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పలు సందర్భాల్లో వంశీకృష్ణను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని.. అవినీతి జరిగిందని.. తన హయాంలో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడలేదని.. ఉమామహేశ్వరుని సాక్షిగా చెబుతాను.. నీవు అవినీతికి పాల్పడలేదని చెప్పగలరా..!? ఆ ధైర్యం నీకు ఉంటే గురువారం ఆలయం వద్దకు రావాలని వంశీకృష్ణ గువ్వలకు సవాల్ విసిరారు.
అనుకున్నట్లుగానే వంశీకృష్ణ తన అనుచరులతో గురువారం ఉదయం ఉమామహేశ్వరుని వద్దకు ఉదయం 10 గంటలకు చేరుకుని పూజలు నిర్వహించి.. ఎమ్మెల్యే గువ్వల రాక కోసం ఎదురుచూస్తున్నారు. నేను స్వామివారి సన్నిధిలో ఉన్నాను. ఎవరి హయాంలో అభివృద్ధి.. అవినీతి జరిగిందో తేల్చుకుందాం.. మధ్యాహ్నం వరకు నీకోసం ఎదురు చూస్తా అంటూ మరోసారి వంశీకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కానీ 12 గంటల వరకు ఎమ్మెల్యే నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వంశీకృష్ణ ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేక తోక ముడిచారంటూ.. తన అనుచర వర్గంతో కలిసి మిగతా కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.