ఒవైసీ పై పోటీ చేయనున్న మాధవి లత.. ఇంతకి ఎవరీమే..?
2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను బీజేపీ శనివారం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో విడుదల చేసిన మొదటి లిస్టులో తెలంగాణకు చెందిన 9 మందికి టికెట్ కన్ఫర్మ్ అయింది.
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను బీజేపీ శనివారం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో విడుదల చేసిన మొదటి లిస్టులో తెలంగాణకు చెందిన 9 మందికి టికెట్ కన్ఫర్మ్ అయింది. వారిలో 8 మంది పురుషులు ఉండగా.. ఏకైక మహిళ.. మాధవి లతకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి స్థానం దక్కింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమె పై పడింది. హైదరాబాద్ పార్లమెంట్ అంటే ఒవైసీకి కంచుకోటగా చెప్పుకునే స్థానం నుంచి బీజేపీ కనీసం తమ పార్టీ సభ్యత్వం కూడా లేని మహిళా సేవకురాలుకు అవకాశం కల్పించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె ఎవరు, ఏం చేస్తుంటారనే ప్రశ్న తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్లో మొదలైంది.
మాధవి లత ఎవరు..?
కోంపల్లి మాధవి లత కోటి మహిళా కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే కోవెంట్రీ విశ్వవిద్యాలయం నుండి ఫ్యాషన్ డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మాధవి లత బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆమె తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసింది. ఆమె అంకితభావం కలిగిన తల్లి మాత్రమే కాదు, నిష్ణాతులైన భరతనాట్యం నర్తకి, వ్యాపారవేత్తగా కూడా పేరుగాంచారు. ఇతరులకు సహాయం చేయాలనే ఆమె మక్కువ, హైదరాబాద్‌లోని పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి కార్యక్రమాలను అందించేందుకు గాను లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
మాధవి లత హైదరాబాద్‌లో అత్యంత ఆదరణ పొందిన ఆస్పత్రుల్లో ఒకటైన విరంచి ఆసుపత్రి ఫౌండర్. ఆమె హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లోని అత్యంత పేద వారికి అండగా ఉంటూ.. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హైందవ ధర్మం కోసం అనునిత్యం పాటుపడే ఆమె.. అనేక కార్యక్రమాల్లో ముఖ్య వక్తగా కూడా స్పీచ్ లు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా.. అనేక మీడియా చానెళ్లు ఆమెను ఇంటర్వ్యూలు కూడా చేశారు.
మహిళా సాధికారతే ఆమె ధ్యేయంగా పని చేసే ఆమెకు కోట్ల ఆస్తి ఉన్న సాధారణ మహిళగా కాషాయపు మడి కట్టుకుని ఏ సమావేశానికైన వెళుతుంటారు. అలాగే ఓల్డ్ సిటీ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న మాధవి లత, ముస్లిం మహిళలకు కూడా అనేక సేవలు అందించారు. ముఖ్యంగా తన ఆస్పత్రిలో వేలాది మంది పేద ముస్లిం మహిళలకు తక్కువ ఖర్చుతో డెలివరీ చేస్తుంటారు.