Indian Railways : ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్..
ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, నేషనల్ బ్యూరో : 370 రైళ్లలో 1,000 జనరల్ బోగీలను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే బోర్డు మంగళవారం ప్రకటించింది. తద్వారా మరో లక్షమంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించవచ్చని తెలిపింది. ఇప్పటికే 583 జనరల్ బోగీలను అమర్చినట్లు స్పష్టం చేసింది. మిగతా రైళ్లకు బోగీలను అమర్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు పేర్కొంది. దేశంలోని అన్ని రైల్వే జోన్లు, డివిజన్లలో ఈ ప్రాసెస్ నడుస్తోందని వెల్లడింది. 2025 హోలి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వేగంగా పనులు చేపట్టినట్లు తెలిపింది. రానున్న రెండేళ్లలో 10వేల నాన్ ఏసీ కోచ్‌లను అందబాటులోకి తేవడం ద్వారా రైళ్లలో 8లక్షల ప్రయాణికులు ట్రావెల్ చేయొచ్చని తెలిపింది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలా లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. 10 వేల కోచ్‌లలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను పాటించడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చనున్నట్లు తెలిపింది.