LRS: ఎల్ఆర్ఎస్ నత్తనడక..! హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత

రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతున్నది.

Update: 2024-12-15 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతున్నది. దీంతో తమ స్థలంలో ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని భావిస్తున్నవారికి ఇబ్బందిగా మారింది. దరఖాస్తుల పరిశీలన ఆలస్యం కావడానికి ఒక్కో శాఖలో ఒక్కో కారణం ఉంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ విభాగాల్లో అయితే సిబ్బంది కొరత కారణంగా ముందుకుసాగడంలేదని అధికారులు చెబుతున్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అయితే ప్రభుత్వ కార్యక్రమాలు అటంకంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అక్టోబర్ 31, 2020 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

25.70 లక్షల దరఖాస్తులు..

రాష్ట్ర వ్యాప్తంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 3,58,464, జీహెచ్ఎంసీ పరిధిలో 1,06,921 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.82 లక్షలు, గ్రామాల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,991, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో 50,411, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 47,506, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో 42,231, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39,944, నల్లొండ మున్సిపాలిటీలో 36,116, సూర్యపేటలో 35,464 దరఖాస్తులు వచ్చాయి.

ఎక్కడికక్కడే..

గతంలో ఎల్ఆర్ఎస్ పై వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాలో పడేవిధంగా నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానంలో కాకుండా దరఖాస్తులను ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తే అక్కడి ఖాతాల్లోనే జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. దీంతో ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయాన్ని సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాలకే జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దరఖాస్తుల ద్వారా సుమారు రూ.10వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్ణయంతో పట్టణ స్థానిక సంస్థలకు కొంత నిధుల కొరత తీరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఇరిగేషన్, రెవెన్యూ ఎన్ఓసీ తర్వాతే..

జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ప్రభుత్వ శాఖలు సైతం ఎల్ఆర్ఎల్ దరఖకాస్తుల పరిశీలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాయి. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, నాలాల సమీపంలో గుర్తిస్తే వాటిని తిరస్కరిస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ ఖరారు కాని చెరువులు, కుంటల పరిధిలోని అన్ని సర్వే నంబర్ల దరఖాస్తులను వెనక్కి పంపించేస్తున్నట్టు సమాచారం. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, నాలాలపై నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఎన్ఓసీ జారీచేసిన తర్వాతనే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నారు. లేదంటే తిరస్కరించాలా? పెండింగ్ పెట్టాలా? అని అధికారులు సందిగ్దంలో ఉన్నారు.

సిబ్బంది కొరత..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించడానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉన్న సిబ్బందితో రెగ్యులర్ కార్యక్రమాలకే పరిమితం కావాల్సి వస్తుంది. హెచ్ఎండీఏలో అయితే జేపీఓలు, ఏపీఓలు లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగడంలేదు. దీంతోపాటు హైడ్రా ఎఫెక్ట్ కూడా ఉండడంతో కొంత జాప్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలు..

రాష్ట్రంలోని 141 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా కొంత ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నవంబర్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం నడిచింది. డిసెంబర్‌లో ప్రజాపాలన ఉత్సవాలు ముగిసిన వెంటనే తర్వాత ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాలు సాగుతోంది. ఈనెలంతా లబ్ధిదారుల ఎంపికనే ఉంటుంది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటన్నింటి కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జనాభా లెక్కల కార్యక్రమాలకు ప్రభుత్వ టీటర్లను కేటాయిస్తే కొంత వెసులుబాటు కలిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News