LRS: అస్తవ్యస్తంగా LRS దరఖాస్తుల పరిష్కారం.. పట్టించుకోని సర్కార్

లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారంలో అనుమానాలు, సందేహాలు, సమస్యలు పెరుగుతున్నాయి.

Update: 2025-03-14 01:47 GMT
LRS: అస్తవ్యస్తంగా LRS దరఖాస్తుల పరిష్కారం.. పట్టించుకోని సర్కార్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారంలో అనుమానాలు, సందేహాలు, సమస్యలు పెరుగుతున్నాయి. ఆదాయం కోసం మాత్రమే గతం కంటే భిన్నంగా వీటిని పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చర్చ జరుగుతున్నది. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల పరిశీలించిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ఫీజు ఇంటిమేషన్ లెటర్ ను అధికారులు పంపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి డీఫాల్ట్ గా ఫీజు ఇంటిమేషన్ లింకు పంపిస్తున్నారు. ఎవరైతే ఫీజు చెల్లిస్తున్నారో వారి దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేస్తున్నారు.

ఏ డాక్యుమెంట్ అయినా.. అదే రేటు

ఓ వైపు రాయితీ అని చెబుతూనే.. వివిధ పేర్లతో అదనపు చార్జీలు వేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. లే అవుట్ లో స్పేస్ లేదని, మార్కెట్ రేటు ఆధారంగా 14 శాతం ఫీజు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. డాక్యుమెంట్ ఏ సంవత్సరానికి చెందినదైతే ఆ ఏడాది ప్రభుత్వ మార్కెట్ రేటు ఆధారంగా ఫీజు వసూలు చేయాలి. అయితే దీనితో సంబంధం లేకుండా 2020 మార్కెట్ రేటు ఆధారంగా ఫీజు వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్ జోన్ లో వందలాది దరఖాస్తుల పరిస్థితి ఇలానే ఉందని సదరు టౌన్ ప్లానింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఫీజు ఇంటిమేషన్ వెళ్లగానే దరఖాస్తుదారులు అధికారుల వద్ద గొడవ చేస్తున్నారు.

ప్రాసెసింగ్ చార్జీల కోసమేనా?

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే ఫీజు చెల్లించడానికి అవకాశమివ్వాలి. కానీ అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ఒక వేళ తిరస్కరించబడితే చెల్లించిన ఫీజులో 10 శాతం ప్రాసెసింగ్ చార్జీల కింద కట్ చేసుకుని మిగిలిన దాన్ని ఇస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీనికోసమే ముందుగానే ఫీజు చెల్లించాలనే నిబంధన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ సమస్యలు

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాఫ్ట్ వేర్ ప్రొవైడ్ చేస్తున్నది. అయితే సర్వర్ సరిగ్గా పనిచేయడంలేదని పలువురు దరఖాస్తుదారులు ఫిర్యాదు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సీడీఎంఏ, డీటీసీపీ పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫీజు చెల్లించడానికి ప్రయత్నం చేస్తుంటే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజీబీపాస్ తరహాలో సాప్ట్ వేర్ ఉంటే దరఖాస్తుల పరిష్కారం సలుభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

2 లక్షల దరఖాస్తుల తిరస్కరణ

పురపాలకశాఖలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సుమారు 2లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 51,234 దరఖాస్తులు, మున్సిపాలిటీల పరిధిలో 1.49లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిసింది. దీంతోపాటు సుమారు 22 వేల మంది దరఖాస్తుదారులు రూ.155కోట్ల ఫీజు చెల్లించారు. అయితే హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 3 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 1,06,921, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.82 లక్షలు, గ్రామాల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ వరంగల్ పరిధిలో 1,00,991 ఇలా.. మొత్తం 25 లక్షల మంది 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read More..

ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు  

Tags:    

Similar News