ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేటు మెడికల్ షాపులను మూసివేయించాలని.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలో ప్రైవేటు మందుల దుకాణాలను మూసి వేయించి ప్రభుత్వమే కావలసిన అన్ని మందులు ఉచితంగా ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-07-01 16:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలో ప్రైవేటు మందుల దుకాణాలను మూసి వేయించి ప్రభుత్వమే కావలసిన అన్ని మందులు ఉచితంగా ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు పెంచుట, ప్రజా ఆరోగ్యాన్ని మెరుగు పరచుట ప్రభుత్వాల బాధ్యత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రభుత్వ దవాఖానాలు, అందులో పనిచేసే డాక్టర్లను, సిబ్బంది నియమిస్తుందన్నారు. అయితే ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చాలన్నారు. ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పించిందన్నారు. కానీ పేదలకు మాత్రం ఉచిత వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు వెళ్లినప్పుడు డాక్టర్లు ఉచితంగా రోగిని పరీక్షించి మందుల చీటీ రాసి ఇస్తారని, కానీ ప్రభుత్వ మందుల దుఖానాలు ఉన్నా అందులో కావాల్సిన మందులు ఉండవు అన్నారు. ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జనరిక్ మందుల షాపులో ఉన్నా అది తెరిచి ఉండదని, కేవలం ఒక బోర్డు మాత్రమే కనిపిస్తోందన్నారు. కేంద్రం హెల్త్ స్కీం ప్రకారం కేంద్ర దవాఖానాలో డాక్టర్ల పరీక్ష అయిన తర్వాత వారు రాసిన మందులన్నీ ఉచితంగా అక్కడే ఉన్న ఫార్మసీలో ఇవ్వడం జరుగుతుందని, ఒకవేళ ఆ సమయానికి కొన్ని మందులు లేకుంటే బయటి నుంచి తెప్పించి ఇస్తారన్నారు. ఇలా రోగి కేంద్ర హెల్త్ స్కీంలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైన చర్యలు చేపట్టాలని కోరారు.

Similar News