‘ఇలాంటివి ఎన్నో చూశా’.. ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

మల్కాజిగిరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అనేక చెరువులు, కుంటలు గుర్రపు డెక్కతో దుర్గంధపూరితంగా మారిపోయాయని, ఇలాంటి

Update: 2024-07-03 16:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అనేక చెరువులు, కుంటలు గుర్రపు డెక్కతో దుర్గంధపూరితంగా మారిపోయాయని, ఇలాంటి ఎన్నో సమస్యలు తాను ఎన్నికల ప్రచారం సమయంలో చూశానని, అందుకే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కేంద్ర మంత్రులను కలిసినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పార్లమెంట్ పరిధిలో రోడ్ల సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు పైప్ లైన్ వ్యవస్థ, డ్రైనేజీ నీరు చెరువులలో రాకుండా చేయడం, పార్కులు గొప్పగా నిర్మించాలని, సిటీలో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, ఎక్స్ ప్రెస్ రోడ్లు పొడిగించడం వంటి అంశాలపై అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్‌ను కలిసి నివేదించినట్లు ఈటల తెలిపారు.

అంతేకాకుండా నాలుగు రోజులుగా రైల్వే మినిస్టర్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్‌తో సమావేశాలు ఏర్పాటు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయని, అయితే ఐడీపీఎల్, హెచ్ఎంటీ లాంటి ఇండస్ట్రీస్ మూతపడ్డాయన్నారు. కాగా ఇండస్ట్రీస్ మినిస్టర్‌తో చర్చలు జరిపి మూతపడిన ఇండస్ట్రీస్‌ను తెరిపించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేలా చూడాలని కోరామన్నారు. ఇదిలా ఉండగా ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బొల్లారం ఆర్ఓబీ, మల్కాజిగిరి వినాయక నగర్, నేరేడ్ మెట్లో అండర్ పాస్, అల్వాల్ వెంకటాపురం నుంచి లయోలా కాలేజ్ వద్ద ఆర్ఓబీ, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత నేరేడ్ మెట్, అల్వాల్ వద్ద రైల్వే స్టేషన్ నిర్మించి అక్కడ ప్రాంత ప్రజలకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించే విషయాలపై రైల్వేశాఖ మంత్రితో చర్చించినట్లు ఈటల తెలిపారు.

అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాదులోని కొంపల్లి, షామీర్ పేటలో నిర్మాణమవుతున్న హైవేలు, ఉప్పల్, ఎల్బీనగర్ లోని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణానికి హామీ ఇచ్చారని ఈటల వెల్లడించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి కంటోన్మెంట్ విలీనానాకి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తినట్లు చెప్పారు. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం సంతోషకరమేనని, అయితే కంటోన్మెంట్ పరిధిలో పనిచేసిన శానిటైజేషన్ వర్కర్స్, ఎంప్లాయిస్ జీతభత్యాలు, సర్వీస్, పెన్షన్ పై దృష్టి పెట్టాలని రాజ్ నాథ్ సింగ్‌ను కోరినట్లు రాజేందర్ వెల్లడించారు. కంటోన్మెంట్ భూముల్లో, ఎయిర్పోర్ట్ భూముల్లో వందల ఏండ్లుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నవారికి హక్కు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


Similar News