రైతన్నల మరణంపై కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నారు: మంత్రి తుమ్ముల

రాష్టంలోని కొన్ని రాజకీయ పార్టీలు నేతన్నలు ,రైతన్నలు దురదృష్టవశాత్తూ ఏ కారణం చేతనైనా మరణిస్తే వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

Update: 2024-07-03 16:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలోని కొన్ని రాజకీయ పార్టీలు నేతన్నలు ,రైతన్నలు దురదృష్టవశాత్తూ ఏ కారణం చేతనైనా మరణిస్తే వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. అధికారాన్ని కోల్పోయి అసహనంతో రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని అన్నారు. చేనేత కార్మిక సంఘం ప్రతినిధులు, పద్మశాలి సంఘ నాయకులు బుధవారం మంత్రిని కలిసి వారి సమస్యలపై వివరించారు. దీనిపై సెక్రటరీ శైలజా రామయ్యర్ మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మహత్యల సంఘటనల పూర్వపరాలు తెలుసుకోకుండా టి.వి ఇతర ప్రచార సాధనాలలో ప్రచారం చేయడం వల్ల మీకు లబ్ది చేకూరుతుందనుకోవడం భ్రమ మాత్రమే అని అన్నారు. ఇటువంటి సంఘటనలను రాజకీయ లబ్దికోసం వాడుకోవడం ఇకనైనా ఆపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రూ . 250. 00 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కో‌కు వస్త్ర సరఫరా కోసం రావడం జరిగిందని తెలిపారు. టెస్కో నుండి వస్త్ర సరఫరాకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. దీని వల్ల నేత కార్మికులకు చేతి నుండి పని దొరుకుతుందని చెప్పారు. నేత కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం 2018 లో పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ. 37. 09 కోట్లు టెస్కో ద్వారా విడుదల చేశామన్నారు. మరమగ్గాల మీద నేసిన వస్త్రముల కొనుగోలుకు సంబంధించిన గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలలో రూ .123. 22 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలు సమస్యను పరిష్కరించుటకు 135 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం రూ. 59.00 కోట్ల నిధులను తమ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. చేనేత రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

పని చేస్తున్న ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. నేత రంగానికి సంబంధించిన పాత బకాయిలు అన్నింటిని పూర్తిగా చెల్లించుటకు తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరిస్తూనే, తాత్కాలిక ప్రయోజనం కంటే నేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చే విధంగా నిరంతరం ఉపాధి దొరికేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, కాష్ క్రెడిట్, చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేయాలని, నేతన్న భీమాను 59 సంవత్సరాలు దాటినా వర్తింప చేయాలనీ, పాథమిక చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించాలని, టెస్కో ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూడా షోరూంలు ఏర్పాటు చేయాలనీ, జనతా చీరలు ధోతుల పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని,యార్న్ డిపో ని ఏర్పాటు చేయాలని మంత్రిని చేనేత సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ సమీక్షలో పద్మశాలి సంఘం, చేనేత కార్మిక సంఘం నాయకులు గడ్డం జగన్నాథం, కమర్థపు మురళి, చెరుపల్లి సీతారాములు, అవ్వారి భాస్కర్, కూరపాటి రమేష్, మండల శ్రీరాములు చేనేత సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Similar News