క్యాన్సర్ లాంటి అవినీతిని నిర్మూలిద్దాం : యూత్ ఫర్ యాంటీ కరప్షన్

సమాజంలో అవినీతి క్యాన్సర్‌లా పెరిగిపోతుందని, దానిని నిర్మూలించాల్సిన బాధ్యత యువతపై ఉందని మాజీ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా అన్నారు.

Update: 2022-12-09 12:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో అవినీతి క్యాన్సర్‌లా పెరిగిపోతుందని, దానిని నిర్మూలించాల్సిన బాధ్యత యువతపై ఉందని మాజీ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా అన్నారు. అవినీతి పెరగడం వల్ల విలువలు తగ్గిపోయి, చెడు రాజ్యమేలుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్​నెక్లెస్ రోడ్డులో అవినీతి వ్యతిరేక వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ గత పది సంవత్సరాలుగా అవినీతి రహిత సమాజం కోసం వినూత్న కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మాజీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారుల్లో జవాబుదారీతనం, పాలకుల్లో పారదర్శకత లేకపోవడం వల్లనే అవినీతి పెరిగిపోతుందన్నారు. అవినీతి పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలు, పౌరులు చట్టాలను ఉపయోగించుకొవాలన్నారు. సమాజంలో అవినీతి పెరిగిపోతుందని, అందరూ చెప్తున్నారు. కానీ అవినీతి నిర్మూలనపై పనిచేసే వారు, ప్రశ్నించే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతిని ప్రశ్నించడమే కాకుండా, నిజాయితీపరులను గుర్తించడం మంచి పరిణామమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ మంచి సమాజం కోసం పోరాటం చేస్తుందన్నారు.

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. గత పన్నెండు సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి రహిత సమాజం కోసం వేలాది మందితో పనిచేస్తున్నామన్నారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని అలవర్చేందుకు అవినీతి నిర్మూలన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని అవినీతి నిర్మూలన కోసం తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు. అవినీతి నిర్మూలిద్దాం, సమాజాన్ని మారుద్దాం అని వందలాది మంది విద్యార్థులు, యువత నినాదాలు ఇస్తూ వాక్ కొనసాగించారు. అవినీతి నిర్మూలన కోసం తమ వంతు బాధ్యతగా ఉద్యమం చేస్తానని విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మీడియా ఇంచార్జ్ జయరాం, యాక్ బృందం కానుగంటి రాజు, కొన్నె దేవేందర్, కొమటి రమేశ్ బాబు, వరికుప్పల గంగాధర్, జి. హరిప్రకాష్, రాజేశ్, అంజుకర్, డా.ప్రతిభాలక్ష్మి, మారియా అంతోని, లక్ష్మికళ, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News