పాలమూరు నీటి వాటా చుట్టూ లీగల్ లిటిగేషన్లు: ప్రొఫెసర్ హరగోపాల్
కృష్ణ, తుంగభద్ర నదులలో పాలమూరు జిల్లాకు దక్కవలసిన నీటి వాటా చుట్టూ లీగల్ లిటిగేషన్లు నెలకొన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కృష్ణ, తుంగభద్ర నదులలో పాలమూరు జిల్లాకు దక్కవలసిన నీటి వాటా చుట్టూ లీగల్ లిటిగేషన్లు నెలకొన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. పాలమూరు కరువు తీర్చేందుకు.. వలసలను ఆపేందుకైనా తెలంగాణ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో పదేపదే చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు’ అని హరగోపాల్ ఆరోపించారు.
తెలంగాణ వచ్చి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని మొట్టమొదటగా పూర్తిస్థాయిలో నీటి వనరులను కల్పించవలసిన పాలమూరు జిల్లాను పక్కన పెట్టి కాలేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేశారని చెప్పారు. జూరాల నుంచి కృష్ణానది వాటాలో పాలమూరు జిల్లాకు దక్కవలసిన నీటి వాటాను తీసుకోవాల్సింది పోయి విద్వ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. మధ్యలో ఈ ప్రాజెక్టును వదిలివేయడం వల్ల పాలమూరుకు నీటి వనరులను కల్పించే అంశం చుట్టూ లీగల్ లిటిగేషన్లు నెలకొన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక్కడి రాజకీయ వెనుకబాటుతనం వల్ల ఈ దుస్థితి నెలకొందని ఆయన వివరించారు.
ప్రతి ఏటా ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు నిరాశ నిస్పృహలతో ఉన్నారని చెప్పారు. 9 సంవత్సరాల తర్వాత ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు వేస్తే.. 30 లక్షల మంది నిరుద్యోగులలో మూడు లక్షల మందికి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని, అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నారని అన్నారు. కానీ పేపర్ లీకేజీ వ్యవహారం వల్ల వాళ్ల ఆశలన్నీ అడియాశలైపోయాయని వాపోయారు. రాజకీయాలతో సంబంధం లేని విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు చదువుకున్న వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ పూర్తిగా బ్రస్టు పట్టిందని, యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయాయన్నారు. కాలుష్య ప్రభావాన్ని చూపే కంపెనీలను ఉమ్మడి పాలమూరు జిల్లా లాంటి వాటిపై రుద్దుతున్నారని ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ అలాంటిదే అని ఆయన గుర్తు చేశారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచిందని చెప్పారు. దీనివల్ల మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో మత రాజకీయాల ప్రభావం పెరిగిపోతుందని దీనిని పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీలకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉందని హర గోపాల్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ప్రధాన భూమిక పోషించాలని కోరారు.
పాలమూరులో బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు: పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజల బాధలను చెప్పుకోవడానికి అవకాశాలు లేకుండా పోయిందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజల సమస్యలు, ప్రభుత్వాలపై పోరాటాలు చేయవలసి వస్తే ఆ విషయాలను టీఎన్జీవో కార్యాలయంలో, ఇతర చోట్ల సమావేశాలు నిర్వహించుకోవడానికి, మీడియాతో మాట్లాడడానికి అవకాశాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. అందుకే మా ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని రాఘవాచారి తెలిపారు.
సమైక్య పాలనలో పరిస్థితులు ఒకలా ఉంటే, ఈ ప్రభుత్వ హయాంలో మరింత భిన్నంగా సమస్యలను గురించి ప్రస్తావిస్తే వేరే విధంగా ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాధతో ప్రజలు కన్నీళ్లు కారుస్తుంటే, కాదు కాదు ఆనందభాష్పాలు రాలుస్తున్నారంటూ సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తిట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారానికి ఎంత మాత్రం కాదని ఆరోపించారు. కరువు వ్యతిరేక పోరాట సమితి, పాలమూరు అధ్యయన వేదికల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యలను వెలుగులోకి తెచ్చామన్నారు.
సాగునీటి ఆవశ్యకతను చెప్పామని, వలసల నివారణకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రభుత్వాలకు పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సమస్యల గురించి పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 50 కి పైగా పుస్తకాలు అచ్చువేసామని ఆయన గుర్తు చేశారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సాగిస్తామని ఆయన వెల్లడించారు. మీడియా పార్టీ వ్రత్యాలు వీడి.. ప్రజల పక్షం వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వామన్ కుమార్, కేసీ వెంకటేశ్వర్లు, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.