కుటుంబానికి దూరమవుతున్న నేతలు.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో అసహనం!

దీపావళికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా వారు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు దూరమవుతున్నారు. మునుగోడ్ బైపోల్ ప్రచారంలోనే ఉండాలని, అక్కడి ప్రజలతోనే దీపావళి

Update: 2022-10-23 00:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా వారు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు దూరమవుతున్నారు. మునుగోడ్ బైపోల్ ప్రచారంలోనే ఉండాలని, అక్కడి ప్రజలతోనే దీపావళి జరుపుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. మొన్న దసరా, నేడు దీపావళికి దూరంగా ఉండటంతో నేతలు పార్టీ అధినేతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల పుణ్యమా అని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, రాష్ట్ర నాయకులు మునుగోడులోనే మకాం వేశారు. యూనిట్ల బాధ్యతలు అప్పగించడంతో నిత్యం ప్రచారంలో తనమునకలవుతున్నారు. ఈనెల మొదటివారం నుంచి మునుగోడుకే పరిమితం అయ్యారు. ఈనెల 5న దసరా పండుగ రోజున మంచి ముహూర్తం ఉండటంతో టీఆర్ఎస్ ప్రజాప్రతిధులంతా తెలంగాణ భవన్‌కు రావాలని సూచించడంతో పండుగ రోజున తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా వచ్చారు. ఆరోజూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో కొంత నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రజాప్రతినిధులంతా మునుగోడులో ఉండటంతో ఈ దీపావళిని అక్కడే జరుపుకోనున్నారు. వారివారికి కేటాయించిన యూనిట్ల పరిధిలోనే ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించినట్లు సమాచారం. ఈ దీపావళి రోజూ సైతం కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోవడంతో కొంత నైరాశ్యానికి గురవుతున్నారు. స్థానిక ప్రజలకు పండుగ రోజూ సైతం అందుబాటులో ఉండకపోవడంతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కూడా నేతలు ఆందోళనకు గురవుతున్నారు.

మునుగోడులోనే మకాం..

పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబంతో జరుపుకోవాలనే కోరిక ఉంటుంది. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగను బంధువుల మధ్య జరుపుకోవడం మధురానుభూతిగా ఉంటుంది. కానీ ఈసారి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కరువైంది. ఈ నెల 5న దసరా, 24న దీపావళి సైతం కుటుంబ సభ్యులకు దూరంగా మునుగోడులోనే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత సీరియస్‌గా తమకు కేటాయించిన ప్రాంతంలో ఉండాలని సూచించడంతో ఎదురు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ప్రజలకు అందుబాటులో ఉండకపోతో పార్టీ అధిష్టానానికి రిపోర్టు పోయే ప్రమాదం ఉంది. ఇది పార్టీ క్రమశిక్షణకు, రాబోయే కాలంలో పార్టీలో గుర్తింపు, టికెట్ల కేటాయింపుపై ప్రభావం చేపే అవకాశం ఉంది. దీంతో నేతల పరిస్థితి ముందునుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితిలా తయారైంది. ఇదిలా ఉంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఏమనుకుంటారో అనే అంశాన్ని వారిని వేధిస్తోంది.

ఇవి కూడా చదవండి: కేసీఆర్ క్యాన్సర్ కిట్లు'.. లక్షణాలున్న వారికి మెడిసిన్స్​ 

Tags:    

Similar News