న్యాయమూర్తి బదిలీపై ఆగ్రహం.. హైకోర్టు ఎదుట లాయర్ల ఆందోళన

తెలంగాణ హైకోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి బదిలీని వెనక్కి తీసుకోవాలని గురువారం నిరసన తెలిపారు.

Update: 2022-11-17 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి బదలీపై న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకోవాలని గురువారం హైకోర్టులో న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టులో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. పాట్నా హైకోర్టులో న్యాయమూర్తుల కొరత కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులను పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మరో వైపు గుజరాత్ హైకోర్టులోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ ఎస్ కారియల్ ను పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేయగా అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. జస్టిస్ నిఖిల్ ఎస్ కరీల్‌ను గుజరాత్ నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనకు నిరసనగా గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నిరవధికంగా విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. బదిలీ ప్రక్రియలో మార్గదర్శకాల ప్రక్రియను అనుసరించలేదని ఆరోపించారు.


Similar News