BRS: పోలీసులకు నైపుణ్యం ఉన్నా, సీఎం పాలనలో వైఫల్యం.. మాజీమంత్రి హరీస్ రావు

పోలీసులకు నైపుణ్యం ఉన్నా, సీఎం పాలనలో వైఫల్యానికి ఇదే నిదర్శనం అని మాజీమంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) విమర్శించారు.

Update: 2024-12-29 14:13 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలీసులకు నైపుణ్యం ఉన్నా, సీఎం పాలనలో వైఫల్యానికి ఇదే నిదర్శనం అని మాజీమంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) విమర్శించారు. ఈ ఏడాది నేరాల రిపోర్ట్(Crime Report) పై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు(Crime Rate) 22.5% పెరిగిందని, అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని, ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. అతేగాక కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని తెలుస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ.. 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31%గా ఉందని, ఇది బీహార్‌లో లాంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే ఘటన జరిగిన మొదటి వారం గోల్డెన్ పీరియడ్‌గా భావించబడుతున్నదని, అయితే, ఆ సమయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని స్పష్టం చేశారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని, ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తుందని అన్నారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు(Telangana Police) ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపణలు చేశారు.

మరోవైపు, ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని, సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారని, ఆఖరికి పేరు మర్చిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారని అన్నారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం ల్యాండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీస్ శాఖను వాడితే బాగుంటుందని చెప్పారు. అంతేగాక రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి మెరుగైన లా అండ్ ఆర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీస్ శాఖ బడ్జెట్ విడుదల చేసి పోలీస్ బలగాలను బలోపేతం చేయాలని, చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇక ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచి వేగవంతమైన న్యాయాన్ని అందించాలి కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించకూడదని హరీష్ రావు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Tags:    

Similar News