భూమి మీ పేరు పైనే ఉందా..రోజు చెక్ చేసుకోవాల్సిందే!
‘ధరణి పోర్టల్ వచ్చేసింది. ఇక రెవెన్యూ రికార్డులు భద్రం. లాకర్‌లో పెట్టి తాళం వేసినట్లే.. ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు.
మీకు వ్యవసాయ భూమి ఉందా? అయితే అది మీ పేరిటే ఉన్నదో లేదో వెంటనే ధరణి పోర్టల్ లో చెక్ చేసుకోండి. ఏమైనా వివాదాలు కనిపిస్తున్నాయా? దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయా? పరిశీలించుకోండి. ఇలా ప్రతి రోజు చెక్ చేసుకోవాల్సిందే. లేకుంటే సరికొత్త సమస్యలు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. భూమి మీ స్వాధీనంలోనే ఉండొచ్చు.. కానీ రెవెన్యూ రికార్డుల్లోనూ ఉండాలి కదా! ఏదైనా తేడా వచ్చిందంటే అధికారులు, కోర్టుల చుట్టూ సంవత్సరాల కొద్దీ తిరగాలి. మాకేం తెలియదని తహశీల్దార్ అంటారు. కోర్టుకు వెళ్లమని కలెక్టర్ కూడా చెప్తారు. మీకు తెలియకుండానే జరగొచ్చు. అందుకే జాగ్రత్త పడండి. లేకుంటే తిప్పలు తప్పవు.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి పోర్టల్ వచ్చేసింది. ఇక రెవెన్యూ రికార్డులు భద్రం. లాకర్‌లో పెట్టి తాళం వేసినట్లే.. ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు. రికార్డులను దిద్దలేరు.’ అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రికార్డులు ట్యాంపరింగ్ చేయలేకపోవచ్చు కానీ లేని వివాదాలను సృష్టించడానికి అక్రమార్కులకు ఈ పోర్టల్ లో ఎన్నో అవకాశాలున్నాయి. ఒకరి భూమిపై మరొకరు వివిధ కోణాల్లో దరఖాస్తులు సమర్పించే వీలుంది. కావాలనే భూములపై వివాదాలు సృష్టించే ఆస్కారముంది. సాగుచేసుకుంటున్న భూమిని నాలా కన్వర్షన్ చేయమని ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లిస్తే చాలు. అయితే దరఖాస్తు చేసిన వ్యక్తి పట్టాదారేనా? మరెవరైనా? అనేది అవసరం లేదు. ఆఖరికి సక్సెషన్, మ్యుటేషన్ కి కూడా ఏవో పత్రాలు సమర్పించి దరఖాస్తు చేయవచ్చు.
అయితే అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించి తిరస్కరించవచ్చు. కానీ దరఖాస్తు సమర్పణ నుంచి తిరస్కరణ వరకు రెండు, మూడు నెలల సమయం పట్టొచ్చు. ఆ టైమంతా సదరు భూమిపై దరఖాస్తు పెండింగ్ ఉన్నట్లు చూపిస్తుంది. దాంతో ఒరిజినల్ పట్టాదారుడు అమ్మేందుకు స్లాట్ బుక్ కాదు. ఏ ఇతర సదుపాయాలను వినియోగించుకోలేడు. దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే వరకు వేచి చూడాల్సిందే. తీరిక దొరికినప్పుడు తహశీల్దార్, కలెక్టర్లు పరిశీలిస్తారు. అప్పుడు వెరిఫికేషన్ లో లోపాలు గుర్తిస్తే ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ (పెండింగ్ దరఖాస్తు) అనేది ట్రాన్సాక్షన్ స్టేటస్ నుంచి పోతుంది. అప్పటి దాకా పట్టాదారుడికి చుక్కలే. రూ.కోట్లు విలువచేసే భూములపై అక్రమార్కులే దరఖాస్తులు సమర్పిస్తూ కొత్త వివాదాలకు తెర తీస్తున్నారు.
స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళితే..
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తుంకి కాల్సలో సర్వే నం.700 లో 1.14 ఎకరాలు, ఖాతా నం.963 ద్వారా పంది సత్తయ్య పేరిట ఉన్నది. అది పట్టా ల్యాండ్. దానిపై ఎలాంటి వివాదాలు లేవు. ఆధార్, ఈ కేవైసీ పూర్తయింది. పట్టాదారు పాసు పుస్తకం కూడా వచ్చింది. ఆఖరికి రైతుబంధు సొమ్ము కూడా ఖాతాలో జమ అవుతుంది. ఈ భూమిని అవసరానికి వేరే వాళ్లకు అమ్మేందుకు యత్నించారు. స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళితే ‘ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ ఆన్ ర్వే నెంబర్ విత్ అప్లికేషన్ నెంబర్ 2300109002 ఇన్ మ్యుటేషన్/సక్సెషన్/నాలా ప్రాసెస్.’ అని ఉంది. ఈ మూడింట్లో ఏ ఆప్షన్ కింద కూడా పట్టాదారుడు అప్లై చేసుకోలేదు. దీంతో తన సొంత భూమిపై ఇలాంటి దరఖాస్తు పెండింగులో ఉండడం చూసి రైతు లబోదిబోమన్నాడు.
ఆఫీసులో ఎంక్వయిరీ చేస్తే ఎవరో నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసినట్లుగా కనిపించింది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ఎలా అప్లై చేస్తారంటూ అధికారులను ప్రశ్నించాడు. అదంతా తమకేం తెలుసంటూ రెవెన్యూ వర్గాలు రిప్లై ఇచ్చాయి. పట్టాదారుడు ఎక్కడా సంతకం పెట్టకపోయినా సొంత భూమిపై ఇతరులెవరో స్వభావాన్ని మార్చేందుకు దరఖాస్తు చేయగలగడం చర్చకు దారి తీసింది. దాంతో ఈ దరఖాస్తును క్యాన్సిల్ చేయాలంటూ ఏప్రిల్ ఆరో తేదీన వర్గల్ తహశీల్దార్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. ఇలా దరఖాస్తు చేసుకోవడానికి ధరణి పోర్టల్ లో ఎలాంటి ఆప్షన్ లేదు. దాంతో లిఖితపూర్వకంగా అర్జీ పెట్టుకున్నాడు.
క్యాన్సిల్ కి ఎన్నాళ్లు?
పంది సత్తయ్యకు చెందిన ల్యాండ్ పై ఆయనకి తెలియకుండానే ఇతరులెవరో అప్లికేషన్ పెట్టుకున్నారని, దాన్ని క్యాన్సిల్ చేయాలంటూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కి లేఖ నం.బి/564/2022, తేదీ.13.4.23 ద్వారా వర్గల్ తహశీల్దార్ సిఫారసు చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ట్రాన్సాక్షన్ స్టేటస్ యథాతథంగా కొనసాగుతుండడం విశేషం. సొంత భూమిపై ఇతరులెవరో దాఖలు చేసిన అప్లికేషన్ పెండింగ్ ఉంటే హక్కుదారుడి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. రూ.లక్షలు విలువజేసే భూమిపై ఏ చిన్న చిక్కులు తలెత్తినా తట్టుకునే స్థితిలో సామాన్యులెవరూ లేరు. అయితే అధికారులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. వాస్తవాలు గుర్తించినా నెల రోజుల నుంచి సదరు అప్లికేషన్ ని రిజెక్ట్ చేయకపోవడం విడ్డూరంగా కనిపిస్తున్నది. తహశీల్దార్ కూడా కలెక్టర్ కి సిఫారసు చేశామంటూ చేతులెత్తేశారు. క్షేత్ర స్థాయిలో అకారణంగా వివాదాల్లో భూమి చిక్కుల్లో పడేశారంటూ ఆందోళనకు గురవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తాత్సారం చేస్తుండడం గమనార్హం.
ఆప్షన్లతోనే ప్రమాదం..
ధరణి పోర్టల్ లో భూములపై ఎవరైనా చేయొచ్చనే ఆప్షన్ తోనే ప్రమాదం నెలకొన్నది. దరఖాస్తు చేసిన తర్వాత ఈ కేవైసీ చేస్తేనే లాగిన్ లోకి వెళ్తుంది. కానీ అప్పటి దాకా పెండింగ్ లో ఉంటుంది. ఇటీవల కేశంపేట మండలంలో ఓ రియల్టర్ కి రైతు భూమి అమ్మనని తెగేసి చెప్పాడు. తనకు నచ్చిన రేటు దక్కకపోవడంతో ససేమిరా అన్నాడు. దీంతో ఆ భూమిపై ఓ అప్లికేషన్ పెట్టి ట్రాన్సాక్షన్ స్టేటస్ పెండింగ్ అని కనిపించేటట్లు చేశారని తెలిసింది. దాంతో ఇతరులెవరూ సదరు భూమిని కొనుగోలు చేసేందుకు రాలేదు.
ఇలాంటి ఆప్షన్లను కూడా అక్రమార్కులు వినియోగించుకుంటున్నారు. పెండింగ్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలంటూ దరఖాస్తుదారుడే సిద్ధం కావాలి.. అప్పటి దాకా ట్రాన్సాక్షన్ స్టేటస్ పెండింగ్ అంటూ కనిపిస్తున్నది. గొప్పగా రూపుదిద్దిన ధరణి పోర్టల్ లో ఇలాంటి లోపాలతో సామాన్య రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. ప్రతి రోజూ ధరణి పోర్టల్ లో చెక్ చేసుకోకపోతే ప్రమాదం ఏ మూల నుంచి వస్తుందో గ్రహించడం కష్టంగా మారింది.