దయనీయంగా తెలంగాణ పరిస్థితి.. ప్రతి నెలా తప్పని తిప్పలు!

సమయానికి చేతిలో డబ్బు లేకుంటే వ్యక్తులుగా మనం ఎవరిదగ్గరైనా తాత్కాలిక సర్దుబాటు కోసం చేబదులు తీసుకుంటాం. ఇది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో సహజం.

Update: 2022-09-18 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సమయానికి చేతిలో డబ్బు లేకుంటే వ్యక్తులుగా మనం ఎవరిదగ్గరైనా తాత్కాలిక సర్దుబాటు కోసం చేబదులు తీసుకుంటాం. ఇది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో సహజం. కానీ సంపన్నులకు ఇలాంటి బాధలుండవ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేబదుళ్ళు తప్పడంలేదు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్నా ప్రతి నెలా రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేబదులు తీసుకోక తప్పడంలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- జూలై మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్)తో పాటు చేబదులు (వేస్ అండ్ మీన్స్ అలవెన్స్), ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 11,235 కోట్లను సమకూర్చుకున్నది. ఒకవైపు సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాలు అందడంలేదు. మరోవైపు గొప్పగా చెప్పుకుంటున్న ఆసరా పింఛన్లకూ నిర్దిష్ట టైమ్‌కు బ్యాంకు ఖాతాల్లో జమకావడంలేదు.

రిజర్వుబ్యాంకుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో ఖజానాలో నిల్వలను మెయింటెయిన్ చేయాలి. ఇది సాధ్యం కానప్పుడు ఎస్డీఎఫ్, చేబదుళ్ళ రూపంలో అడ్వాన్సు తీసుకుని సర్దుబాటు చేసుకోవాలి. అప్పటికీ తక్కువ పడితే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉంటే ఇవేవీ లేకుండా ఖజానాలో ఒప్పందం ప్రకారం తగినంత డబ్బు నిల్వలు ఉంటాయి. 'ఫైనాన్షియల్ ప్రుడెన్స్' సక్రమంగా లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కామెంట్ చేస్తే రాష్ట్ర మంత్రి కేటీఆర్ దానికి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అప్పులు, గ్రాంట్లు, చట్టబద్ధంగా రావాల్సిన నిధుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నారు. నిత్యం వాదనలు కూడా జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వుబ్యాంకు విడుదలు చేసిన సెప్టెంబరు నెల బులెటిన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రతి నెలా చేబదుళ్ళు తీసుకుంటూనే ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేని కారణంగానే ఈ రూపంలో సర్దుబాటు చేసుకుంటున్నట్లు గతంలో కాగ్ సైతం తన నివేదికలో వెల్లడించింది. కరోనాకు పూర్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఏడాది కాలంలో 297 రోజుల పాటు అడ్వాన్సులేవీ తీసుకోకుండా నెట్టుకొచ్చింది. మిగిలిన రోజులకు మాత్రమే రూ.32,206 కోట్ల మేర అడ్వాన్సు రూపంలో సమకూర్చుకున్నది. కేవలం 8 రోజులు మాత్రమే ఎస్డీఎఫ్, చేబదుళ్ళు, ఓవర్ డ్రాఫ్ట్ లాంటి సౌకర్యాన్ని ఏకకాలంలో వాడుకున్నది.

కానీ, 2020-21 కాలంలో మాత్రం ఏకంగా 158 రోజుల పాటు అడ్వాన్సుల రూపంలో రిజర్వు బ్యాంకు నుంచి ఏకకాలంలో ఎస్డీఎఫ్, చేబదుళ్ళు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకున్నది. ఏడాది కాలంలో అంతకుముందు తీసుకున్న అడ్వాన్సులతో పోలిస్తే 86% ఎక్కువగా తీసుకున్నట్లు కాగ్ గుర్తించింది. మొత్తం రూ. 69,453 కోట్లను సర్దుబాటు చేసుకున్నది. గతేడాది లెక్కలను ప్రస్తుతం నివేదిక రూపంలో తయారుచేసే పనుల్లో కాగ్ నిమగ్నమైంది. ఇలా అడ్వాన్సుల రూపంలో తీసుకున్న డబ్బును 31 నుంచి 45 రోజుల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వడ్డీని కూడా చెల్లించక తప్పదు. 2019-20లో రూ. 29 కోట్లను మాత్రమే వడ్డీగా చెల్లిస్తే 2020-21లో రూ. 71 కోట్లను చెల్లించింది.

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్నందున ప్రతి నెలా సగటున 30 రోజుల పాటు ఎస్డీఎఫ్, చేబదుళ్ళను తీసుకున్నది. గడచిన నాలుగు నెలల్లోనే రూ. 11,235 కోట్ల మేర అడ్వాన్సుల రూపంలో తీసుకున్నది. ఇందులో రూ. ఎస్డీఎఫ్ అడ్వాన్సులు ప్రతి నెలా 30 రోజుల పాటు రూ. 2,754 కోట్లు ఉన్నాయి. చేబదుళ్ళు కూడా సగటున 30 రోజుల పాటు రూ. 4,942 కోట్లు ఉన్నాయి. ఇక ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని సగటున 14 రోజుల పాటు రూ. 3,539 కోట్ల మేర తీసుకున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆంక్షలతో ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాల (స్టేడ్ డెవలప్‌మెంట్ లోన్స్)కు ఇబ్బంది ఒకవైపు, వివిధ అభివృద్ధి పనులకు ద్రవ్య సంస్థల నుంచి తీసుకునే అప్పులకు మరోవైపు చిక్కులు ఏర్పడ్డాయి.

ఈ ప్రభావం ఉద్యోగుల జీతాలపైనా, ఆసరా పింఛన్లపైనా, సంక్షేమ పథకాల అమలుపైనా కనిపిస్తున్నది. దళితబంధుకు రూ.17,700 కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించినా ఆర్థిక శాఖ ద్వారా రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా ఆ దామాషా ప్రకారం డబ్బులు విడుదల కాలేదని ఎస్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యాఖ్యానిస్తున్నది. దీనికి తోడు తాజాగా గిరిజనబంధు పేరుతో భూమిలేని పేద ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు కూడా తలా రూ.10 లక్షల చొప్పున సాయం అందించే పథకాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆసరా పింఛన్లకు అర్హత వయసును 57 ఏండ్లకు కుదించినా, లబ్ధిదారులకు కార్డులను మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేసినా ఆ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని మొత్తుకుంటున్నారు.

చేబదుళ్ళ రూపంలో తీసుకున్నా సర్దుబాటు కష్టంగా మారింది. ధనిక రాష్ట్రం, ఫైనాన్షియల్ ప్రుడెన్స్ బాగున్నదని చెప్పుకుంటున్నా ఇలాంటివి తప్పడంలేదు. కరెంటు చార్జీల పెంపు, వాహనాల టాక్స్ పెంపు, గ్రీన్ టాక్స్ విధింపు, భూముల విలువ సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, సర్కారు భూముల అమ్మకం, రాజీవ్ స్వగృహ ప్లాట్ల విక్రయం... ఇలా అనేక రూపాల్లో ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నా చేబదుళ్ళు అనివార్యమవుతున్నది.

Tags:    

Similar News