KTR : రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బహిరంగ లేఖ(Open Letter) రాశారు.
దిశ, వెబ్ డెస్క్ : చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బహిరంగ లేఖ(Open Letter) రాశారు. ఆ లేఖలో.. కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని అన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డారు. సీఎం ఢిల్లీకి పంపించే మూటలపై మీకున్న శ్రద్ధ.. ప్రజలకు మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏ పేజి తిప్పి చూసినా.. మోసం మీ నైజం.. అవినీతి మీ ఎజెండా, నియంతృత్వం మీ విధానమని అడుగడుగునా కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు.
మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం చేతిలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్రే వహిస్తారా అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్లుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమేనని ఈ ఏడాది పాలన రుజువు చేసిందని విమర్శించారు. గత పదేళ్లలో తాము తెలంగాణ పునర్నిర్మాణంపైనే దృష్టి పెట్టాం తప్ప.. పనికిమాలిన ఆలోచనలు చేయలేదని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేర్లు మార్చలేదు, ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. కానీ మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ చేసిన ఈ నీచమైన, కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం అని గుర్తుంచుకోవాలని లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.