Cyber Frauds: ట్రేడింగ్ లాభాల పేరుతో డాక్టర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.11.11 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
ట్రేడింగ్ లాభాలు(Trading Profits), డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో హైదారాబాద్(HYD)లో జరిగిన రెండు ఘటనలలో సైబర్ నేరగాళ్లు ఏకంగా 17.77కోట్లు కొల్లగొట్టారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ట్రేడింగ్ లాభాలు(Trading Profits), డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో హైదారాబాద్(HYD)లో జరిగిన రెండు ఘటనలలో సైబర్ నేరగాళ్లు ఏకంగా 17.77కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటనలు అలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను అశ్రయించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ చెందిన ఓ డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.11.11కోట్లు 34 విడతలలో కొట్టేశారు. ఆగస్టు నుంచి జరుగుతున్న ఈ మోసం ప్రస్తుతం బయటకు వచ్చింది. కాగా ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి ట్రేడింగ్ బిజినెస్ పేరుతో బాధితుడి వాట్సాప్ లో లింక్ పంపించాడు. ఆ వెబ్సైట్లో డాక్టర్ తన పేరును నమోదు చేసుకున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్ కోసం భారతీయ కరెన్సీని యూఎస్ఓటీ అనే క్రిప్టో కరెన్సీలోకి మార్చాల్సి ఉంటుందని చెప్పారు. వారు చెప్పిన ఖాతాలకు బాధితుడు ఆర్జీఎస్ ద్వారా నగదు బదిలీ చేశారు. విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా రూ.3.7 కోట్ల పన్ను చెల్లించాలని చెప్పారు. తన వద్ద రూ.2 కోట్లే ఉన్నాయని డాక్టర్ తెలపగా మిగతా రూ.1.7 కోట్లు రుణంగా ఇప్పిస్తామని మిత్తల్ చెప్పాడు. రూ.2 కోట్లను బాధితుడు చెల్లించిన మరోసారి విత్ డ్రాకు ప్రయత్నించారు. యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం ముందస్తు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అప్పటికే రూ.11.11 కోట్లు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGSSB)కి బదిలీ చేసి కేసు నమోదు చేశారు.
డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి..
టెలికామ్ రెగ్యూలారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)నుండి మాట్లాడుతున్నామని ఓ వితంతు మహిళను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ. 5.66 కోట్లు కొల్లగొట్టారు. గత 20రోజులుగా జరిగుతున్న ఘటన అలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ బషీర్ బాగ్(Basheerbagh)కు చెందిన 69 ఏళ్ల మహిళకు నవంబరు 13న రాత్రి 9.20 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి రాహుల్ కుమార్, ట్రాయ్ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్ కార్డ్ జతచేసి ఉన్న ఫోన్ నంబరు మనీ ల్యాండరింగ్, మనుషుల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వ్యాపారానికి సంబంధించిన కేసులతో ప్రమేయం ఉందని చెప్పాడు. అనంతరం సీబీఐ అధికారులమంటూ సౌరవ్ శర్మ, అజయ్ గుప్తా అనే ఇద్దరు స్కైప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు. నిర్దోషిత్వం రుజువయ్యే వరకూ ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరూ కుమార్తెలను వీడియో కాల్ పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. వారి ఖాతాల్లో ఉన్న డబ్బంతా తాము చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేయాలని, నేరంతో సంబంధం లేదని తేలినాక వెనక్కి పంపుతామని తెలిపారు. నవంబరు 14 నుంచి డిసెంబరు 3 వరకూ వివిధ దఫాల్లో రూ.5,66,51,100 అజయ్ గుప్తా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. డిసెంబరు 8న అజయ్ గుప్తాకు ఫోన్ చేస్తే ష్యూరిటీ సహా సంబంధిత పత్రాలన్నీ తీసుకొని సమీపంలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లాలని తెలిపాడు. అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఖాతాల్లో మళ్లీ డబ్బు పడుతుందని చెప్పాడు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన భాదితులు తాము మోసానికి గురయ్యామని తెలుసుకున్నారు. సోమవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో పిర్యాదు చేయడంతో మోసాలు బహిర్గతమైయాయి.