ఢిల్లీ BRS కార్యాలయ ప్రారంభోత్సవానికి KTR దూరం.. కారణమదేనా!

సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Update: 2022-12-14 03:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ బుధవారం శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి జాతీయ రాజకీయాల‌కు కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరమయ్యారు. అందరూ వెళ్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రత్యేక అనుమతితో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్లు మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వాహన దిగ్గజం మారుతి సుజుకి‌కి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో ముందే సమావేశం ఫిక్స్ అయింది. మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు హైదరాబాద్‌కు ప్రతినిధి బృందం చేరుకుంది. సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. గత కొంతకాలంగా జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీతో విస్తృతంగా పెట్టుబడుల సంప్రదింపులు జరుగుతున్నాయి. అదే విధంగా ఉదయం 10.45కు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో బోస్క్ (Bosch) ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం ఉన్నది. ఈ రెండు కీలక సమావేశాలు నేపథ్యంలో ఈ ఉదయం ఢిల్లీ చేరుకోవాల్సిన కేటీఆర్, ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో ఢిల్లీకి వెళ్ళలేక పోతున్నట్లు సమాచారం.

పెట్టుబడులేనా? మరే ఇతర కారణాలా?

మొదటిసారి ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో కేటీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యాలయానికి క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ కీలక నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపాలిటీలు, జడ్పీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి భారీగా తరలి వెళ్లారు. ఈ తరుణంలో కేటీఆర్ వెళ్లకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. పార్టీ కార్యాలయానికి కన్నా.. పెట్టుబడులే ముఖ్యమా అనే విమర్శలు ఊపందుకున్నాయి. పెట్టుబడుల గురించి ఈరోజు కాకపోతే రేపైనా సంబంధిత కంపెనీలతో చర్చలు జరపచ్చని.. కానీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని వేస్తున్న తొలి అడుగు‌లోనే కేసీఆర్‌కు కేటీఆర్ షాక్ ఇచ్చినట్లు అయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో పార్టీ బాధ్యతల‌పై క్లారిటీ ఇవ్వని కేసీఆర్

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్... రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కేసీఆర్ కుటుంబంలోనే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ సంతోష్ కుమార్ సైతం తనదైన శైలిలో రాజకీయాల్లో ముద్ర వేసుకున్నారు. ఈ తరుణంలో ఎవరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌కు తల నొప్పులు తప్పవు. అందుకే మౌనం పాటిస్తున్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

మరో ఏడాదిన్నర ఆగాల్సిందేనా?

పార్లమెంట్ ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉంది. బీఆర్ఎస్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తుండగా... ఆ ఎన్నికల సమయంలోనే రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్‌కు గాని కవితకు గాని అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. అయితే వీరిద్దరిలోనే ఒకరికి అవకాశం ఇస్తారా? లేకుంటే... వేరే వారికి ఎవరికైనా ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో వెళ్తున్న కేసీఆర్.. రాష్ట్ర పార్టీ బాధ్యతలు రైతు నేతకు అప్పగించి దేశంలో సైతం ఈ అంశాన్ని వాడుకుంటారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Read More...

తెలంగాణ సర్కారుపై ట్విట్టర్‌లో Manikkam Tagore Fire 


Similar News