మీ నాయకులు పోతుంటే ఢిల్లీలో ఏం చేస్తున్నావ్ కేటీఆర్!.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Update: 2024-07-09 10:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమ నాయకులు పోతుంటే కేటీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఆయన మంచి అపోజిషన్ లీడర్ గా పేరు తెచ్చుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో ఢిఫెక్షన్ లా తీసురావడం జరిగిందని, వాటిని 2014 తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ లు పూర్తిగా తుంగలో తొక్కాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని, గతంలో ఓటింగ్ తో బిల్లులు పాస్ చేయాలంటే ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపేవారు కానీ చేర్చుకునే వారు కాదని, ఆ సంస్కృతిని తీసుకొచ్చింది మహానాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ నంబర్ దాటాక కూడా ఇతర పార్టీ లీడర్లను భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్న ప్రక్రియ బీఆర్ఎస్, బీజేపీలదేనన్నారు. ఇందులో ఒక్కో పార్టీది ఒక్కో స్టైల్ అని, ఒకపక్క బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులతో భయపెట్టి చేర్చుకుంటే, మరోపక్క కేసీఆర్ తెలంగాణలో ఏ పార్టీ ఉండకూడదు అనే నియంతృత్వ పోకడలతో జాయిన్ చేసుకున్నారని విమర్శించారు. ఇక కేటీఆర్ ఢిల్లీలో ఉండి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ చెప్పడానికి అర్హత లేదని, ప్రజలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలుచేయాలనే చిత్తశుద్దితో ఉంది కాబట్టే ప్రజా పాలనలో భాగంగా ప్రతీ గ్రామానికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసిందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో ఎన్ని జీవోలు ఇచ్చారు. ఎన్ని చీటెడ్ జీవోలు ఇచ్చారు. ఎంత డబ్బు ఖర్చుపెట్టారు అని ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు సైతం తెలియని స్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 65 వేల కోట్ల అప్పు నుండి 9 లక్షల పై చిలుకు అప్పుకు తీసుకొచ్చారని, ఎన్నికల సమయంలో 4 లక్షల కోట్లే అనుకుంటే.. అధికారంలోకి వచ్చాక 100 రోజులు సచివాలయంలో కూర్చొని ప్రక్షాళన చేస్తే 9 లక్షల కోట్ల పై చిలుకు అప్పులు ఉన్నాయని క్లారిటీ వచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ నెలలోనే రుణమాఫీ చెస్తామని చెప్పారని కేటీఆర్ అంటున్నారని, మీరు ఏమైనా మిగిలించి పోతేనే కదా రుణమాఫీ చేసేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయాలంటే ఎంత డబ్బు కావాలో మాకంటే మీకే బాగా తెలుసని, ఎందుకంటే రైతులకు ఎగ్గొట్టి పోయింది మీరేనని అన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ఆగస్ట్ 15న రుణమాఫీ చేస్తానని చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాడని, ఆ విధంగానే ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. కానీ మీరే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు ప్రజలకు మంచి పాలన చేసుంటే ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదని, అయినా మీ నాయకులు పక్క పార్టీలకు పోతుంటే కాపడుకోవాల్సింది పోయి నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావో అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.

మాకు చేర్చుకోవాల్సిన అవసరం లేదని, మాకు కమ్యూనిస్టులతో కలిపి 65 మంది ఎమ్మేల్యేలు ఉన్నారని, మీరు పదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం లేకుండా.. భయభ్రాంతులకు గురిచేసి పని చేయించుకున్నారని, అందుకే పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మీ పాలనలో నలిగిపోయి, మీ మీద ద్వేషంతో.. స్వేచ్ఛను కోరుకొని పార్టీ మారుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, వరదలు వచ్చిన సమయంలో ఎన్నో చెరువులు వచ్చి కలుస్తుంటాయని మేము ఆపడానికి ఉండదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్లకి మంత్రి పదవులు రావని చెప్పినా కూడా వచ్చి జాయిన్ అవుతున్నారని, ఈ పరిస్థితికి కారణం నువ్వు మీ నాయన కేసీఆర్, హరీష్ రావు అని చెప్పారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండి ఎవరికి కలవలేదని, నీ దగ్గరకి వస్తే యువరాజు కన్నా ఎక్కువ యాక్టింగ్ చేసేవాడివని, ఇక సచివాలయంలో ఎవరు లేక వారి భాదలు చెప్పుకోలేక గోసలు పడ్డారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకి ఎవరు వెళ్లిన కలుస్తారని, అపాయింట్ మెంట్ లేకుండా వెళ్లినా కూడా డైరెక్ట్ గా లోపలికి పిలిచి మాట్లాడుతారని అన్నారు. ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలనే పట్టుదలతో ఉన్నది వాస్తవమని, అడ్డగోలుగా కుటుంబం మొత్తం దండుకొని వెళ్లారని, ఇప్పుడు ఏం తోచక ఢిల్లీలో దాక్కొని ప్రెస్ మీట్ పెడుతున్నారని అన్నారు.

అలాగే మీరు మీటింగ్ లు పెడితే కూడా మీ ఎమ్మెల్యేలు రావడం లేదంటే వారికి మీ మీద ఎంత గౌరవం ఉందో ప్రజలకు అర్ధం అవుతుందన్నారు. ఈరోజు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి రావాలని కోరుకుంటున్నారని, ప్రజా ప్రతినిధులు స్వేచ్చని కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ ఆస్కార్ యాక్టింగ్ చేస్తున్నాడని కేటీఆర్ మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే.. బీజేపీ వాళ్లు దానిని హిందూ ధర్మానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆయన స్పీచ్ వింటే ఎక్కడా కూడా హిందువులకు వ్యతిరేఖంగా మాట్లాడినట్టు లేదన్నారు. బీజేపీ కూడా ఈ సారి కొద్దిలో తప్పించుకుందని, వచ్చేసారి కేటీఆర్ సహా బీజేపీ వాళ్లు తీర్ధయాత్రలకు వెళ్లి చిడతలు వాయించుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ దేశంలో నంబర్ వన్ యాక్టింగ్ చేయగల నాయకుడు ఒక్క కేసీఆర్ గారేనని, వన్ మ్యాన్ షో చేస్తాడని, మాది ప్రజాస్వామ్య పార్టీ అని, మాకు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని, దానికోసం రేవంత్ రెడ్డి అహర్నిషలు కష్టపడుతున్నారని స్పష్టం చేశారు. మీ పాలనలో టీఎస్పీఎస్సీని పేపర్ లీకులు చేసి ఆగం పట్టించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి ప్రక్షాళన చేసి ఈ ఏడాది డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇక కేటీఆర్ మాటలు పట్టించుకోవద్దని, ప్రజాపాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కేటీఆర్ మంచి మాటలు మాట్లాడి, మంచి అపోజిషన్ లీడర్ గా పేరు తెచ్చుకోవాలని చామల కిరణ్ కోరుకున్నారు.  


Similar News