కేటీఆర్... ఇంకెనాళ్లు అసత్య ప్రచారాలు : మంత్రి దామోదర ఆగ్రహం

రాజకీయాల కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు.

Update: 2024-09-02 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయాల కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. డెంగీ కేసుల విషయంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సోమవారం మంత్రి కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌‌ఎస్ హయాంలో నమోదైన డెంగీ కేసుల కంటే, ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి ట్విటర్‌‌లో పోస్ట్ చేశారు. అన్ని వివరాలు తెలుసుకుని ఆ తర్వాత ట్వీట్లు చేయాలని, కేవలం రాజకీయాల కోసం జనాలను ఆందోళనకు గురిచేసేలా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో డెంగీ, వైరల్ ఫీవర్స్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారని, ఇప్పటికే ఒక రౌండ్ పూర్తికాగా, ఇప్పుడు రెండో రౌండ్ సర్వే కొనసాగుతోందన్నారు. ఈ సర్వేలలో 2,93,371 మంది బాధితులను గుర్తించి, ట్రీట్‌మెంట్ అందజేశారని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో టెస్టింగ్ కిట్లు, మెడిసిన్ అందుబాటులో ఉందని, ప్రజలు ఆందోళన గురికావొద్దని మంత్రి సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో... డాక్టర్లు, సిబ్బంది అంతా 24 గంటలు హాస్పిటళ్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జ్వరం లేదా మరే ఇబ్బంది ఉన్నా సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


Similar News