KTR: ఏచూరి సంస్మరణ సభలో పార్టీ మార్పులపై కేటీఆర్ హాట్ కామెంట్స్

కండువాలు మార్చే ఈ కాలంలో.. అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-21 07:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో సిద్ధాంతం చుట్టూ స్థిరంగా నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాక కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శనేత ఆయన అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జరిగిన కామ్రేడ్ సీతారామ్ ఏచూరి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి నవాళి అర్పించిన కేటీఆర్ అనంతరం సభలో మాట్లాడారు. సీతారామ్ ఏచూరికి బీఆర్ఎస్ తరపున నివాళి అర్పించారు. ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి అన్నారు. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరని.. తాము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డ ప్రజల కోసం జరిగే పోరాటంలో ముందున్నామని ఏచూరి చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాటాలు తెలియని వారు ఎంతో మంది ఉండవచ్చు, ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా చూసే వారు ఇంకెందరో ఉన్నారన్నారు. కానీ ఉన్నత చదువులు చదివిన కుటుంబం నుంచి వచ్చిన సీతారం ఏచూరి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించిన గొంతుకగా ఎదిగిన ఏచూరి వ్యక్తిత్వం చాలా గొప్పదన్నారు. ప్రజల కష్టం, వారి సుఖం, దుఃఖం గురించి ఏచూరికి బాగా తెలుసు.

రాజకీయాల్లో ఏచూరి హుందాతనం తమ లాంటి భవిష్యత్ రాజకీయ తరాలకు ఓ ఇన్స్ప్రేషన్ అన్నారు. ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా ఉండి నాడు అత్యున్నత స్థానంలో ఇందిరాగాంధీ ముందు నిలబడి ఆమెను రాజీనామా చేయాలని కోరడానికి ఎంత గుండె ధైర్యం కావాలి?.. రాజ్యంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి ఏచూరి అన్నారు. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని నమ్మిన వ్యక్తి ఆయన అన్నారు. పదవుల కంటే సిద్ధాంతం, ప్రజా సమస్యలపై పోరాటం, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిలాష ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా, చిరంజీవిగా నిలబడేలా చేస్తుందనడానికి ఏచూరి జీవితం ఒక ఉదాహరణగా భావిస్తున్నానన్నారు.

మా పార్టీలు వేరైనా, మా సిద్ధాంతాలు వేరైనా, గతంలో వారు తెలంగాణ ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండవచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్తసంబంధంగా ఉంటుందన్నారు. బతికున్నంత వరకు ప్రజల కోసం బతికిన ఏచూరి, మరణించాక కూడా తన దేహాం ఈ దేశంలోని వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడాలన్న ఆయన ఆశయం చాలా గొప్పదన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదం పడ్డప్పుడు మన మౌనం చాలా ప్రమాదకరం అని ఏచూరి చెప్పేవారని అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యం అయిన ప్రతిసారీ, ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.


Similar News