Bhatti Vikramarka : 'మీ స్థాయికి తగ్గ మాటలు కావు' మోడీ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్

కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్సే అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-09-21 06:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విద్వేష రాజకీయాలకు పునాది బీజేపీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తిన వాళ్లను దేశ ద్రోహులుగా, అర్బన్ నక్సల్స్ గా ముద్రించి నిర్బంధ పాత్ర పోషిస్తున్నదే బీజేపి అన్నారు. 'కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్' అంటూ మహారాష్ట్ర పర్యటనలో ప్రతిపక్షంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిదన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉందని, అర్బన్ నక్సల్స్ అంటూ ప్రధాని మోడీ విద్వేషపూరిత వ్యాఖలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

మీ స్థాయికి తగ్గ మాటలు కావు:

దేశ సమగ్రత, సమైక్యత విషయంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని అవినీతిపరులు, విభజన వాదులు, అర్బన్ నక్సలైట్ లు అనడం ప్రధాని స్థాయికి తగ్గ మాటలు కావు అని భట్టి మండిపడ్డారు. గాంధీ నడయాడిన వార్ధా కేంద్రంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం దేశంలో మత విద్వేషాలు రాజేసేది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే, ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి మంచిది కాదని హితవు పలికారు. ఈ దేశం లో మోడీ అమలు పరుస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేకత ప్రశ్నించే క్రమంలోనే రాహుల్ గాంధీ దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసిన విషయం మర్చిపోవద్దని, జోడొ యాత్ర లక్ష్యమే దేశంలో పెచ్చరిల్లిన మత విద్వేషం, రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామిక విలువల పునాదిగా బయలుదేరిందని గుర్తు చేశారు. ఈ దేశంలో బీజేపీ చేస్తున్న మత, విద్వేష, అబద్దాల రాజకీయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు.

అమెరికాకు పయనమైన భట్టి:

అమెరికా పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం తొలుత ఢిల్లీకి వెళ్లిన ఆయన అక్కడి నుంచి యూఎస్ కు వెళ్లనున్నారు. అమెరికాలో జరుగుతున్న మైనింగ్ ఎక్స్ పో, గ్రీన్ పవర్ రంగాల్లో అధునాతన పద్దతులుపై డిప్యూటీ సీఎం, అధికారుల బృందం వారం రోజుల పాటు అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు సంస్థలతో తెలంగాణలో పెట్టుబడుల విషయంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.


Similar News