తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ అంటూ KTR సంచలన ట్వీట్

బొగ్గు గనుల వేలం అంశంపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

Update: 2024-06-21 13:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బొగ్గు గనుల వేలం అంశంపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి గారికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రంది లేదు అని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు.. సింగరేణి కార్మికులపై అభిమానం లేదన్నారు. ఇద్దరికీ పట్టలేనంత సంతోషం.. మాటల్లో చెప్పలేనంత ఆనందం.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిత్రమే.. వీరి కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం అని మండిపడ్డారు. వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి.. వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులా..?? అని ప్రశ్నించారు. సిరుల గనికి మరణశాసనం రాస్తూ... చిద్విలాసమా ??వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా ? అంటూ ఫైర్ అయ్యారు.

ఈ “వేలం” వెర్రి నిర్ణయాల నుంచి.. తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకేనా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఈ ఫిరాయింపులు ?? అని సీరియస్ అయ్యారు. ఆరునెలలైనా గ్యారెంటీలు అమలుచేయలేని.. అసమర్థత నుంచి తప్పించుకునేందుకేనా ఈ కుప్పిగంతులు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైంది బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు. మీ రెండు జాతీయ పార్టీలకు వేసిన ఓటు.. తెలంగాణ జాతి ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అన్నారు. సంక్షేమానికి పాతరేసి.. అభివృద్ధిని పాతాళానికి తొక్కేసి..ఇద్దరూ ఆడుతున్న వికృతక్రీడ ఇది అని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు కంటికి రెప్పలా కాపాడిన.. తెలంగాణ సహజ సంపదను చెరబట్టినందుకు.. కాంగ్రెస్, బీజేపీలను చరిత్ర ఎప్పటికీ క్షమించదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే బొగ్గు గనుల వేలంలో సింగరేణికే బ్లాకులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 


Similar News