బోనస్ కాదది బోగస్ : కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి(Singareni) కార్మికులకు ప్రకటించింది బోనస్ కాదని, బోగస్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి(Singareni) కార్మికులకు ప్రకటించింది బోనస్ కాదని, బోగస్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సింగరేణి సంస్థకు ఈ ఏడాది రూ. 4,701 కోట్లు లాభం వచ్చిందని, దానిలో 33% వాటా కింద రూ. 1,551 కోట్లు కార్మికులకు దసరా బోనస్ ఇచ్చామని ప్రకటించారు. అలా అయితే ఒక్కో కార్మికునికి రూ. 3.70 లక్షలు బోనస్ అందాలి. కానీ వాస్తవంగా చూస్తే ఒక్కో కార్మికునికి రూ. 1.90 లక్షలు మాత్రమే వచ్చిందని వివరించారు. ఒక్కో కార్మికునికి 16.2% మాత్రమే లాభంగా ఇచ్చి దానిని 33% లాభాలు ఇచ్చామని భట్టి గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, లేదా సింగరేణి సంస్థను నష్టాల్లో నెట్టివేసామని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ గనులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంటే దానిని అడ్డుకోకుండా.. కార్మికులను బోనస్ ల పేరుతో మభ్యపెడుతూ.. గనుల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ సహకరిస్తోందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ హయాంలో సింగరేణిని విజయాల బాట పట్టించామని వెల్లడించారు. 2014 లో ఒక్కో కార్మికునికి సింగరేణి లాభాల్లో రూ. 17 వేలు ఇస్తే.. 2023 నాటికి అది రూ. 1.60 లక్షలు ఇచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు.