అరెస్టు భయంతో బీజేపీ పెద్దలను కలుస్తున్న కేటీఆర్!

ఫార్ములా ఈ-రేసులో జరిగిన నిధుల గోల్ మాల్ వ్యవహారంపై రాజ్ భవన్ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.

Update: 2024-11-12 02:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-రేసులో జరిగిన నిధుల గోల్ మాల్ వ్యవహారంపై రాజ్ భవన్ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణమే ఏసీబీ విచారణకు అనుమతి ఇచ్చేందుకు రెడీగా ఉంది. కానీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ కు లేఖ రాయగా, కేంద్ర పరిధిలో పనిచేసే ఆయన ఎలాంటి సలహా ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ లోపే మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడంపై కాంగ్రెస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే బీజేపీ పెద్దలను కలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో అసలు ఫార్ములా ఈ– రేసులో కేసు నమోదు అవుతుందా?లేదా? అనే చర్చ జరుగుతున్నది.

అటార్నీ సలహాపై ఉత్కంఠ

ఫార్ములా ఈ– రేసింగ్ అంశంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు అటార్నీ జనరల్ ఇచ్చే సలహా ఎలా ఉంటుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఎందుకంటే ఏజీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు. దీంతో ఆయన ఇచ్చే న్యాయ సలహా వెనుక ఏమైన రాజకీయ శక్తుల ప్రమేయం ఉంటుందా? అనే డిస్కషన్ జరుగుతున్నది. ‘కేసు విచారణకు అనుమతి ఇవ్వొచ్చు అని రాజ్ భవన్ కు సలహా ఇస్తే ఏసీబీ దర్యాప్తునకు బీజం పడుతుంది. అలాకాకుండా విచారణలో నాటి మంత్రులను పక్కన పెట్టాలని సూచించినా, నిధుల మళ్లింపులో ఎలాంటి బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరగలేదని అటార్ని జనరల్ నిర్దారణకు వస్తే ఏసీబీ ఎంట్రీకి బ్రేకులు పడినట్టే అవుతుంది.’ అని లీగల్ ఎక్స్ పర్ట్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఉన్నపళంగా కార్ల రేసింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ లీడర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీ పెద్దల వద్దకు వెళ్లారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత అటార్నీ జనరల్ ఇచ్చే సలహాలో ఏమైనా మార్పులు ఉంటాయేమోననే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

మౌనంగా బీజేపీ లీడర్లు

కేటీఆర్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అని పదే పదే అడిగే రాష్ట్ర బీజేపీ లీడర్లు ఫార్ములా ఈ – రేసింగ్ వివాదంలో మాత్రం మౌనంగా ఉన్నారు. ఇంతవరకు ఎవరూ ఆ కేసుపై మాట్లాడలేదు. పార్టీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పలేదు. దీనికి తోడు గవర్నర్ అటార్నీ జనరల్ ఒపీనియన్ అడగడంతో కాంగ్రెస్ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ కేసు నుంచి కేటీఆర్ ను తప్పించేందుకు బీజేపీ సహకరిస్తుందా? అని ఆరా తీస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ ఎవరిని కలుస్తున్నారనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. అయితే తన ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ‘అప్పుడే వణికితే ఎలా?’ అని సెటైర్ విసిరారు. దీనిపై పలు రకాలుగా చర్చ జరుగుతున్నది. ఫార్ములా ఈ– రేసింగ్ కేసులో తాను అరెస్ట్ కాను అనే ఉద్దేశ్యంతోనే ఆ విధంగా పోస్టు పెట్టారా? అనే డౌట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది.


Similar News