సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై KTR ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Update: 2024-07-11 12:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా..? లేక రేవంత్ రెడ్డి సన్నాసా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6వేల అదనపు పోస్టులతో విద్యార్ధులను, నిరుద్యోగులను సీఎం రేవంత్ దగా చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అన్నారు. తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ ఏమైందని నిరుద్యోగులు, విద్యార్థులు అడుగుతున్నారని గుర్తు చేశారు. పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను, ప్రజాప్రతినిధులుగా, చైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేకమందిని పార్టీ తయారు చేసుకోగలిగిందన్నారు. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుందన్నారు.   


Similar News