ట్రోలింగ్ ఆపకపోతే చెప్పు దెబ్బలే! కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్రోలింగ్ చేయిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Update: 2024-10-03 11:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్రోలింగ్ చేయిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ సమీపంలోని నాంపల్లి చౌరస్తాలో తాజాగా టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో కేటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డౌన్ డౌన్ కేటీఆర్ అంటూ కేటీఆర్ చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సునీతా రావు మాట్లాడుతూ.. ట్విట్టర్ వేదికగా మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ ఆపివేయాలని, ట్రోలింగ్స్ చేయించింది కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్‌కు చెప్పుదెబ్బలు తప్పవని, వచ్చే లోకల్ బాడి ఎన్నికల్లో జీరో సీట్లు వస్తాయని ఫైర్ అయ్యారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా తమ నేతల పై ట్రోలింగ్ ఆపేయాలని, లేదంటే దొరికిన ప్రతీసారి చెప్పుదబ్బలే కొడతామని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా, ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లా పర్యటనలో బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో చేనేత మాల ఒకటి వేశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, అలా ట్రోల్ చేసినవారు బీఆర్ఎస్ వారని.. వారి ప్రొఫైల్ పిక్షర్లలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలు ఉన్నాయని, ఆ ఇద్దరి నేత ప్రోద్బలంతో వారు ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై కేటీఆర్ మీడియా చిట్ చాట్ ద్వారా స్పందించారు. దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికని ప్రశ్నించారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ వాళ్లెవరూ ట్రోలింగ్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి.


Similar News