Lagacharla issue: కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టు, రైతులను వదిలేయ్ రేవంత్ రెడ్డి: కేటీఆర్
లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన దాడిలో భాగస్వాములంటూ పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన దాడిలో భాగస్వాములంటూ పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం) కేటీఆర్ వాళ్లందరినీ జైలుకెళ్లి పరామర్శించారు. తాము అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని, మెజిస్ట్రేట్‌కు ఈ విషయం చెబితే వాళ్ల ఇళ్లలో వాళ్లకి ఇదే గతి పడుతుందని బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో ఉన్న రైతుల బాధ వర్ణనాతీతంగా ఉందని, సంఘటనతో సంబంధం లేని వాళ్లను కూడా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అని, ఫార్మా విలేజ్ పేరుతో కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టడమే ఆయన ప్లాన్ అని తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్.. భూమి కోల్పోయిన రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ‘‘సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే.. మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
జైల్లో తాము 16 మందిని కలిశామని, అయితే గొడవతో సంబంధం లేని వాళ్లను జైళ్లలో పెట్టి చిత్ర హింసలుపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. జైల్లో ఉన్న వాళ్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగి ఆయన. అలాంటి వ్యక్తిని దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు. వనపర్తిలో చదువుకుంటున్న ఇంకొక తమ్ముడు గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే.. అతడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిజానికి దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచరులే అధికారులపై దాడులు చేశారని బాధితులు చెబుతున్నా.. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి డైరెక్షన్‌లో నడుస్తున్న పోలీసులు ఇలా అమాయకులను అరెస్ట్ చేసి బాధలు పెడుతున్నారు. 30, 40 కిలోలు కూడా లేని పిల్లలపై అంటెంప్ట్ మర్డర్, కలెక్టర్ పై దాడులు చేశారంటూ కేసులు పెట్టారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలపై కేసులు పెట్టటానికి నీకు మనసేలా వచ్చింది.
గతంలో ఫార్మా అంటే కాలుష్యం అంటూ ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 3 వేల ఎకరాలు ఎలా తీసుకుంటున్నాడు? కాంగ్రెస్ తమ చేతగానితనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. అన్న అండతో తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యాంగేతర శక్తిగా మారాడు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారి పేదల భూములను కొల్లగొడుతున్నాడు. నువ్వు చక్రవర్తివి కాదు. నీలాంటి చాలా మంది చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. కానీ రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తప్పక తగులుతుంది. 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది. ఫార్మా విలేజ్ ల పేరుతో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూముల దందా చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’’ అంటూ కేటీఆర్ రైతులకు హామీ ఇచ్చారు.