అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివి

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా కొనసాగుతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-11-15 11:22 GMT

దిశ, భైంసా : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా కొనసాగుతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించుకుని భైంసా మండలంలోని మాటేగాం టోల్ ప్లాజా వద్ద గల ఓ ప్రైవేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హాజరై మాట్లాడారు. గతంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా డబుల్ బెడ్రూం, ఉద్యోగాలు, కొబ్బరి నీళ్లలాంటి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం ముందుకు సాగేదన్నారు. రైతులను రాజు చెయ్యాలని గిట్టు బాటు ధరలతో పాటు, ఇందిరమ్మ ఇల్లు, మూలకు పడిన ఇరేగేషన్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందన్నారు. గత పాలకులు పది సంవత్సరాలలొ కొత్తరేషన్ కార్డులు, కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వలేదన్నారు.

     కేవలం ఉప ఎన్నికల నేపథ్యంలోనే వాటిని సరి పెట్టారన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అన్నింటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన కొనసాగిస్తుందన్నారు. 2020 లో తెచ్చిన రెవెన్యూ చట్టం, ధరణి పేరుతో రైతులను భయ భ్రాంతులకు గురి చేసి భూములున్న ఆసాములకు ఎకరాలకు ఎకరాలు కట్టపెట్టారన్నారు. ఎవరి అభిప్రాయలను లేక్కలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకుందన్నారు. మొదటి బడ్జెట్లో రైతుల కోసం రూ.72000 కోట్లను కేటాయించగా ఇప్పటికే రూ.18 వేల కోట్లతో రుణమాఫీ చేశామని, మిగిలిన రూ.13 వేల కోట్లు డిసెంబర్ వరకు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 రైతుల ఖాతాలో జమచేస్తున్నామన్నారు.

    ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందజేస్తామని, కుల గణన సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అక్కడి బంధువులకు, కార్యకర్తలు ఇక్కడి పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భైంసా పట్టణంలోని ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి నారాయణ రావు పటేల్ నివాసానికి చేరుకోగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పలువురు లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. 


Similar News