రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటింది : కేటీఆర్
బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమవాస్య కు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేవంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఏద్దేవా చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమవాస్య కు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేవంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఏద్దేవా చేశారు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి అని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి 45 రోజులు అయ్యింది, ఈడీ కానీ బీజేపీ వాళ్లు కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయటం లేదంటూ ప్రశ్నించారు. తాను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్ లు పుట్టుకొస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిందని, రాహుల్, ప్రియాంకలకు డబ్బులు కావాలి, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నాడన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ కవచంగా మారిందని, మేము రేవంత్ రెడ్డి ని తిడితే బీజేపీ ఎంపీలకు ఎందుకు రేషం వస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు.
కోకాపేట లో భూముల్లో నేను అవినీతి పాల్పడితే విచారణ చేయ్.. తప్పు చేస్తే శిక్ష వేయ్ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. శనివారం తెలంగాణ భవన్ లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్ లు తమ అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే ఒక శక్తి, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అని రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని, గతంలోనూ ఎంతో మంది కేసీఆర్ ఫినిష్ చేస్తా అన్నారని, కానీ చరిత్ర తొంగి చూసుకో రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లు ఎక్కడ ఉన్నారో...వాళ్లతోనే కాలేదు, నువ్వు ఎంత..? కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే... రేవంత్ రెడ్డికి సీటు సీటు ఉంటుండేనా..? పదవులు ఉండటం కాదు, ప్రజల గుండెల్లో కేసీఆర్ కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు, ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరని, కేసీఆర్ రైతుబంధు రూ.10 వేలు బిచ్చం వేసినట్లు వేస్తున్నాడు... కాంగ్రెస్ వస్తే ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం అని నువ్వే కదా అన్నావ్, వానాకాలం రైతు బంధు ఇప్పటికీ పడలేదు, దాన్ని ఎగ్గొట్టారు, రైతన్నలు ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే రెండు లక్షలు చేస్తా అంటివి, సోనియమ్మ బర్త్ డే నాడే చేస్తా అంటివి. ఒక ఏడాది అయిపోయింది, మళ్లీ సోనియమ్మా బర్త్ డే వస్తోంది, ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వలేదు, సోనియా గాంధీని మాత్రమే కాదు మొత్తం ప్రజలందరినీ మోసం చేశాడంటూ కేటీఆర్ విమర్శించారు.
మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నస్తున్నాడని, బీజేపీ నాయకులు మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు స్పందించి ఇవ్వాళ మూసీ పక్కన పండుకుంటారంట, చాలా సంతోషం, మూసీ లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలకు కచ్చితంగా వివరంగా చెప్పాల్సి అవసరం మాపైన ఉందన్నారు. మూసీ మే లూటో... ఢిల్లీ మే బాటో అనే విధంగా ఉన్నది వీళ్ల తీరు ఉందన్నారు. మూసీ గురించి అడిగితే కొత్త పల్లవి ఎత్తుకున్నారని, బాపు ఘాట్ వద్ద అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు, గాంధీ కి విగ్రహాలు ఇష్టం ఉండదని అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మా గాంధీ మనువడు చెప్పాడన్నారు. గాడ్సే శిష్యుడు, గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి, గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా..? మహత్మా గాంధీని విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదంటూ కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటింది, ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ డబ్బులు కావాలి, వాళ్లకు డబ్బులు పంచాల్సిందే, అందుకే మూటలు పంపే పనిలో ఉన్నాడన్నారు. ఓఆర్ఆర్ లీజును ఒక సంస్థకు రూ. 7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని రూ. 7 వేల కోట్లే ఇచ్చారన్నాడు. మరీ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ. లక్ష కోట్లు తీసుకురా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తాను కోకాపేట లో భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వేయ్ అంటూ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ప్రధాని మోడీయే అంటారు, మరి ఎందుకు విచారణ జరపకుండా మౌనంగా ఉన్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తాము అమృత్ టెండర్ల గురించి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు సమాధానం లేదని, మూసీ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు లూటీ చేస్తుంటే బీజేపీ వాళ్లు ప్రశ్నించటం లేదన్నారు. త్రిపుల్ ఆర్ సినిమా కన్నా ఆర్ఆర్ ట్యాక్స్ లు ఎక్కువ అయ్యాయంటూ ప్రధాని మోడీయే అన్నాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి పై ఎందుకు చర్యలు లేవు, కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ కవచంగా మారిందని, రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారాడరని, తాము రేవంత్ రెడ్డి ని తిడితే బీజేపీ ఎంపీలకు రేషం వస్తోందని, బండి సంజయ్, రఘనందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్వింద్ లు తట్టుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. అసలు వాళ్లు బీజేపీ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా? రేవంత్ కూడా బీజేపీలో ఉన్నాడా? కాంగ్రెస్ లో ఉన్నాడా? అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అమాయకుడు. పాపం రాసిచ్చింది చదువుతాడు. ఆయన లీడర్ కాదు రీడర్ అంటూ ఏద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తో మాకు గట్టు పంచాయితీ ఏమీ లేదని, కొడంగల్ లో గిరిజనుల భూమి గుంజుకోవటం పై ప్రశ్నిస్తే ఆయనకు కోపం వస్తోందని, పొంగులేటి మీద ఈడీ గురించి అడిగితే కోపం వస్తోందంటూ ఏద్దేవా చేశారు. తాను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్ లు పుట్టుకొస్తారని, ఇప్పడే పోరాటం మొదలైందని, మరో నాలుగేళ్లు ఈ కాంగ్రెస్ తో పోరాటం చేయాల్సి ఉంటుందని, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆయన వెళ్లిపోయిన సరే కార్యకర్తలే పార్టీ నడుపుతుండటం సంతోషనిస్తోందన్నారు. ప్రకాష్ గౌడ్, గాంధీలకు సిగ్గుందా? ఏ పార్టీ లో ఉన్నారో చెప్పే దమ్ముందా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. రాజేంద్రనగర్ లో ఉప ఎన్నిక రావటం ఖాయమని, ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని, రాజేంద్రనగర్ ను భవిష్యత్ లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కార్తీక్ రెడ్డి అంటూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.