కేటీఆర్ అరెస్ట్ తప్పదా..? నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌తో ఊపందుకున్న ప్రచారం
లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదనే ప్రచారం ఊపందుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
దిశ, తెలంగాణ బ్యూరో: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదనే ప్రచారం ఊపందుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ మేరకు కేడర్‌లోనూ అరెస్ట్ అనుమానం బలపడింది. మరోవైపు.. బుధవారం అర్ధరాత్రే కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో నందినగర్‌లోని ఆయన నివాసానికి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జై తెలంగాణ.. జై కేటీఆర్ అంటూ నినదించారు. దీంతో కేటీఆర్ సైతం అలర్ట్ అయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా మాజీమంత్రులతో భేటీ అయి అరెస్టు తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టాల్సిన నిరసనలపై వారికి పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్యమం సమయంలో ఏ విధంగా నిరసనలు చేపట్టారో.. ఆ స్థాయిలో ఆందోళనలకు ప్రణాళికలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా లీగల్ టీంను సైతం అందుబాటులో పెట్టుకొని వారితోనూ చర్చించారు.
నేతలతో కేటీఆర్ వరుస భేటీలు
ఇప్పటికే ఫార్ములా ఈ-రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. కానీ.. ఆ కేసుల్లో ఇంతవరకు పురోగతి లేదు. అయితే.. తాజాగా లగచర్ల ఘటనను ప్రభుత్వం మరింత సీరియస్‌గా తీసుకోవడం.. ఈ కేసులో కేటీఆర్ పేరు తెరమీదకు రావడంతో ఇక ఆయన అరెస్ట్ తప్పనిసరి అని ప్రచారం సాగింది. ఈ క్రమంలో గురువారం కేటీఆర్ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల నేతలతో తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లతో పలు అంశాలపై చర్చించారు. గ్రేటర్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు సైతం వచ్చి కేటీఆర్‌ను కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర వాటిపై చర్చించినట్లు సమాచారం. ఎవరికి ఏ నోటీసులు వచ్చినా అధైర్యపడొద్దని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. నోటీసులు అందుకునే అవకాశం ఉన్న వారికి ముందస్తుగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. మరోవైపు..ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. ఇందులోనూ కేటీఆర్ పాత్రపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
ఉద్యమాన్ని తలపించేలా ఆందోళనలకు ప్రణాళికలు
పోలీసులు కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. మండల, నియోజకవర్గస్థాయిలో నిరసనలు చేపట్టాలని పార్టీ నేతల భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో ఎలాగైతే ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చారో.. అదే మాదిరిగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేటీఆర్ అరెస్టును మరింత అనుకూలంగా మలచుకునేందుకు కార్యక్రమాలు చేపట్టాలని, కేటీఆర్‌ను ఎన్ని రోజులు జైల్లో పెడితే అన్ని రోజులు నిరాటకంగా నిరసనలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ అరెస్టును రాజకీయంగా వాడుకోవాలని.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైపల్యాలను వివరించి కాంగ్రెస్‌ను దోషిగా నిలపాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నది.
నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ
కేటీఆర్ అరెస్టు అవుతారనే ప్రచారం నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు భారీగా వస్తున్నారు. మొన్నటివరకు సందడి లేని భవన్ ఇప్పుడు కేడర్ రాకతో కళకళలాడుతున్నది. భారీగా తరలివచ్చి పార్టీలో ఏం జరుగుతున్నది..? కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా..? కేటీఆర్ జైలుకు వెళ్తే పార్టీని నడిపేది ఎవరు..? అంటూ ఆరా తీయడం కనిపించింది. మరోవైపు.. పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? పార్టీ కమిటీలు వేస్తారా? కాలయాపనతోనే కాలం వెళ్లదీస్తారా? అనే అంశాలను చర్చిస్తున్నారు.