KTR: ఈ మాటలు చెప్పడానికి బాధపడుతున్నా.. బీఆర్ఎస్ నేత భావోద్వేగ ట్వీట్
మహబూబాబాద్ లో హృదయవిదారక ఘటన జరిగిందని, నేను ఈ మాటలు చెప్పడానికి కూడా బాధపడుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబాబాద్ లో హృదయవిదారక ఘటన జరిగిందని, నేను ఈ మాటలు చెప్పడానికి కూడా బాధపడుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేధింపులకు గురైన బాలిక రాఖీ కట్టిన తర్వాత మృతి చెందింది అని ఓ దినపత్రిక ప్రచురించిన కథనానికి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయ భావోద్వేగబరిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని మహబూబాబాద్‌లో మూడు రోజుల క్రితం స్థానిక గూండాల వేధింపులు భరించలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి, తన సోదరులను మళ్లీ చూడలేమన్న ఆందోళనతో, మరణానికి గంటల ముందు వారికి రాఖీ కట్టిందని అన్నారు. ఈ హృదయవిదారకమైన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిందని, నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. 4 రోజుల కంటే ఎక్కువ సమయం గడిచినా.. స్థానిక అధికారుల చర్య శూన్యమని, నేను ఈ మాటలు చెప్పడానికి కూడా బాధపడుతున్నానని కేటీఆర్ ఎక్స్ లో రాసుకొచ్చారు.