Kodandaram: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు రావడం మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) విచారణకు రావడం మాజీ సీఎం కేసీఆర్(KCR) బాధ్యత అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ (Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఆర్‌కేఆర్ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ జరిపిన బహిరంగ విచారణకు కోదండరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో ఉన్న లోపాలను, నిబంధనల ఉల్లంఘనలను కమిషన్ ముందు ఉంచామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అప్పులు తప్పా నీళ్లు రాలేదని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం కంటే ముందే గోదావరి జలాలపై చాలా అధ్యయనం చేశామని వివరించారు. ప్రాణహిత చేవెళ్లను అనేక మంది ఇంజనీర్లు ఆలోచించి డిజైన్ చేశారని చెప్పారు.
తెలంగాణకు తక్కువ ఖర్చుతో నీళ్లను ఇవ్వడానికి రూపొందించింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీర్లు సైతం వ్యతిరేకించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక నిబంధనలు తుంగలో తొక్కారని కాగ్ స్పష్టం చేసిందన్నారు. "బీఆర్ఎస్ నాయకులు మేమే కట్టినాం అంటున్నారు. కానీ, కట్టినవి పని చేయాలి కదా?" అని ప్రశ్నించారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ ఇప్పటికే తేల్చిచెప్పిందని, తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పనికిరాదని నిపుణులు చెప్తున్నారని వెల్లడించారు.
ఫార్ములా వన్ రేస్ అంశంపై స్పందన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. (KTR) ఫార్ములా వన్ రేస్ (Formula E Race) కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పిదమని కోదండరామ్ విమర్శించారు. క్యాబినెట్ అనుమతి లేకుండా అలాంటి నిర్ణయం తీసుకోవడం తగదని, కేటీఆర్‌పై చర్యలు తప్పక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త కారు కొనుగోలు పై వివరణ
కొత్త కారు కొనుగోలు పై వచ్చిన విమర్శలపై కోదండరామ్ స్పందించారు. "నా కారు చాలా తిరిగింది. కొత్తది కొనడం తప్పనిసరి. ఎమ్మెల్సీ అయ్యాక ఇచ్చే లోన్ ద్వారా కొత్త కారు కొనుగోలు చేశాను" అని వివరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేతలు బైరీ రమేష్, సర్దార్ వినోద్ కుమార్, రవికాంత్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.