లిక్కర్ స్కాంలో DMK నాయకులు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌పై కిషన్ రెడ్డి ఫైర్
లిక్కర్ కుంభకోణంలో అనేక మంది డీఎంకే నాయకుల ప్రమేయం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ కుంభకోణంలో అనేక మంది డీఎంకే నాయకుల ప్రమేయం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల ప్రజాధన దోపిడీపై ప్రజల దృష్టి మరల్చేందుకు రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెండు నెలలుగా డీఎంకే పార్టీ, తమిళనాడు సీఎం స్టాలిన్ వితండవాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దక్షిణ భారతదేశానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందంటూ, దాన్ని ఎదుర్కొంటామనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామంటూ ప్రకటించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని, ప్రజల దృష్టి మళ్లించేందుకే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్ అంశాలపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి దివాళాకోరుతనంతో కూడిందన్నారు.
వచ్చే ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోనుందని, డీఎంకే పాలన, స్టాలిన్ కుటుంబ అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. దాన్నుంచి తప్పించుకోవడానికి రాజకీయ నాటకాలు ఆడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమిళనాడులో తీవ్రమైన అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం విధించిన అధిక పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, పార్లమెంట్ నియోజకవర్గాలను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
జాతీయ నూతన విద్యా విధానం ఇప్పుడే కొత్తగా ప్రవేశపెట్టలేదని, 1986లో కాంగ్రెస్ హయాంలోనే డీఎంకే మిత్ర ప్రభుత్వం దీనిని ప్రవేశ పెట్టిందన్నారు. అప్పుడు వ్యతిరేకించలేదని, హిందీ యేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించే విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. త్రిభాషా సిద్దాంతం బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైందని, నరేంద్ర మోడీ కొత్తగా ప్రవేశపెట్టలేదని, సి. రాజగోపాలాచారి ఆలోచనలతోనే త్రిభాషా సిద్ధాంతం వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కొఠారి కమిటీ త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచిందని, ఇవన్నీ డీఎంకే నాయకత్వానికి తెలుసన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ రాష్ట్రంపైన హిందీ భాషను బలవంతంగా రుద్దలేదని చెప్పారు.