గాంధీ భవన్ కు తెలంగాణ భవన్ కు తేడా లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్ంపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
దిశ, శంషాబాద్/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కవల పిల్లలని, ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించేలా పోటీపడి వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ శంషాబాద్‌లో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ అనైతికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఇప్పడు కాంగ్రెస్ పార్టీ అదే బాటలో పయణిస్తోందని దుయ్యబట్టారు. గాంధీభవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేదన్నారు. గతంలో అక్రమంగా వసూలు చేసిన డబ్బును దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ పంపితే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూటుకేసులు పంపుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కారు విశ్వాసం కోల్పోయింది..
కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 13 వాగ్ధానాలు, 66 అంశాలు వంద రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వంద రోజులు దేవుడెరుగు.. రెండు వందల రోజులైనా దేవుడి మీద ఓట్లు, ఆర్భాటపు ప్రకటనలతో కాలం వెల్లబుచ్చుతున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను దగా చేస్తున్నదన్నారు. వారి నిరంకుశ, నియంతృత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతుల ధర్నాలు, నిరసనలు, లాఠీ చార్జీలు కనిపిస్తున్నాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. నిస్సిగ్గుగా చేర్చుకుంటోందని ఫైర్ అయ్యారు.
బీజేపీ ప్రజల పక్షం..
బీజేపీ ఎవరికో ఏ టీమ్, మరెవరికో బీ టీమ్ అంటూ వస్తున్న విమర్శలపై కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తే, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోందని, నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటని అన్నారు. గతంలో కలిసి పని చేసిన చరిత్ర ఈ రెండు పార్టీలదని గుర్తు చేశారు. బీజేపీ ఎవరి పక్షం కాదని, తెలంగాణ ప్రజల పక్షం అని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును గెలవలేకపోయిందన్నారు. రేవంత్‌రెడ్డి సొంత ప్రాంతం మహబూబ్‌నగర్‌లోనూ బీజేపీ సత్తా చాటిందన్నారు.
కీలక అంశాలపై చర్చ..
పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. బీజేపీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై డిస్కస్ చేశారు.