Kishan Reddy: బడ్జెట్ కేటాయింపులే ఈ నిర్లక్ష్యానికి నిదర్శనం.. కేంద్రమంత్రి ట్వీట్ ప్రభుత్వం

తెలంగాణలో రెండు ప్రభుత్వాలు ప్రజారోగ్యా్న్ని నిర్లక్ష్యం చేశాయని, ఈ వైఫల్యం సాధారణ పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-28 10:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండు ప్రభుత్వాలు ప్రజారోగ్యా్న్ని నిర్లక్ష్యం చేశాయని, ఈ వైఫల్యం సాధారణ పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆరోగ్యంపై పలు జాతీయ పేపర్లలో వచ్చిన కథనాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం కొనసాగుతోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను నిరంతరం నిర్లక్ష్యం చేశాయని, ఇందుకు నిదర్శనం ఆరోగ్య రంగానికి వారి బడ్జెట్ కేటాయింపులేనని స్పష్టం చేశారు.

ఇన్నేళ్లుగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో కొత్త మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటికే ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేయబడటమే దీనికి ఉదాహారణ అని చెప్పారు. వర్షాకాలం రాకముందే నీటి ద్వారా వ్యాపించే రోగాల ప్రభావం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని, ఆరోగ్య మౌలిక సదుపాయాలలో ఈ పూర్తి వైఫల్యం సాధారణ పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రి సంసిద్ధతను తక్షణమే సమగ్రంగా సమీక్షించాలని, మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి డెంగ్యూ నివారణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు.


Similar News