కిన్నెర మొగులయ్యకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నం.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వెల్లడి

ఆర్థిక ఇబ్బందులతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య రోజువారీ కూలీగా మారినట్లు తాజాగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

Update: 2024-05-03 12:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక ఇబ్బందులతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య రోజువారీ కూలీగా మారినట్లు తాజాగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రూ.10 వేల పింఛన్ ఆగిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. మొగులయ్యపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని స్పష్టంచేశారు. 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సందర్భంలో అండగా ఉంటూ వస్తుందన్నారు. ఆయన కళను గౌరవించి ఆయనకు పద్మశ్రీ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం నుంచి మొదలుకొని ఆయనకు నగదు ప్రోత్సాహక బహుమతిని, నెలవారీగా కళాకారుల పెన్షన్‌ను అందించడం వరకు అన్ని రక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు.

గతంలో మొగులయ్యకు కోటి రూపాయలను నగదు ప్రోత్సాహక బహుమతిగా అందించినట్లు వెల్లడించారు. ఆ మొత్తం ఆయన ఖాతాలోనే జూన్ 2022 లో జమ చేసినట్లు స్పష్టంచేశారు. జూన్ నెల 2021 నుంచి మొగులయ్యకు ప్రతి నెలా రూ. 10,000 ల చొప్పున పెన్షన్‌ను ఏప్రీల్ 2024 వరకు అందించడం జరిగిందని స్పష్టంచేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీపీఆర్వో బి. అయోధ్య రెడ్డి ఐఎఫ్ఎంఐఎస్ రిపోర్ట్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుంది. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించి అత్యున్నతంగా గౌరవిస్తుంది. గుస్సాడి కనకరాజు, దర్శనం మొగులయ్య తదితరులకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లించింది. మార్చి 31 రోజున ముగిలయ్యకు పెన్షన్ చెల్లించిన రిపోర్టు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Tags:    

Similar News