ఆడపడుచులు ఆత్మ గౌరవంతో జీవించాలి
తెలంగాణ ఆడపడుచులు ఆత్మ గౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, భద్రాచలం: తెలంగాణ ఆడపడుచులు ఆత్మ గౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఇందిరమ్మ అభయ హస్తంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ ఐదవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి రామయ్య దర్శనం అనంతరం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతాం అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఆడపడుచుల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. ప్రతి సంవత్సరం గోదావరి వరదలు కారణంగా భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు ముంపుకు గురి కాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ. 500 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ… భద్రాచలం అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రామాలయం అభివృద్ధితో పాటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులు వెచ్చించడానికి అయినా సిద్ధం అని, నివేదికలు తయారు చేసిన తర్వాత నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఐదవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమానికి రామయ్య పాదాల చెంత శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు తప్పితే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేరిట ప్రజలను కేసీఆర్ మోసం చేసారని అన్నారు. మంత్రులు సీతక్క, సురేఖలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, దానిలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం రూ .500 కే గ్యాస్ సిలిండర్, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళలు పేరుమీదే ఇస్తున్నామని అన్నారు. అనంతరం ఇందిరమ్మ గృహ నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు. దీనిలో భాగంగా జిల్లాలోని పలువురు లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.