హరీస్-హలీం దుకాణాల టెండర్ ఎవరికి దక్కేనో..!
రంజాన్ మాసంలో హరీస్-హలీం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు. హరీష్-హలీం పాయింట్ కోసం గత రెండు నెలల నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
దిశ, ఖమ్మం: రంజాన్ మాసంలో హరీస్-హలీం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు. హరీష్-హలీం పాయింట్ కోసం గత రెండు నెలల నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఎలాగైనా టెండర్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న ఉర్దూఘర్ షాధీఖానాలో హరీస్- హలీం దుకాణాల కోసం నిర్వహించే వేలం కోసం వ్యాపారస్తులు పోటీ పడుతున్నారు.
ఉర్దూఘర్ షాధీఖానాలో ప్రతి సంవత్సరం హరీస్-హలీం దుకాణాల కోసం ఖమ్మం తహసీల్దార్ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. షాధీఖానాలో దుకాణాలను దక్కించుకున్న వ్యాపారి నెల రోజుల పాటు వ్యాపారం నిర్వహించుకోవచ్చు. వచ్చిన ఆదాయం తో షాదీఖానా అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తారు.
ఈ ఏడాది టెండర్‌లో పెరగనున్న వ్యాపారస్తులు..
ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉర్దూ ఘర్ షాదీఖానా లో ఏర్పాటు చేసే హరీష్-హలీం దుకాణాల టెండర్ కోసం నామా మాత్రంగా నే వ్యాపారస్తులు వచ్చేవారు. అయితే ఈ టెండర్ వచ్చే వ్యాపారస్థులను ఓ వ్యాపారి భయటే మాట్లాడి సిండికేట్ అయ్యేవారు. దీంతో టెండర్ తక్కువ ధరకే దక్కించుకునేవారు. 2021 సంవత్సరంలో కరోనా ఉన్న నేపథ్యంలో ఎవరు రాకపోవడంతో ఒక వ్యాపారికి 1.5 లక్షలకు ఇచ్చారు. 2022 సంవత్సరంలో టెండర్ ప్రక్రియ నిర్వహించి 3.20 లక్షలకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. గత ఏడాది సిండికేట్ అయ్యారు అని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఏడాది నిర్వహించే దుకాణాలకు టెండర్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే కొంతమంది వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ హరీస్-హలీం వ్యాపారంలో ఆసక్తి ఉన్నవారు ఎవరు ఉన్నారో వారి అందరితో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది 4 లక్షల పైనే టెండర్ పలుకుతుందని వ్యాపారస్థులు తెలుపుతున్నారు. ఖమ్మం రెవెన్యూ శాఖ అధికారులు పత్రికా ప్రకటన, షాధీఖానాలో నామా మాత్రం గా గోడ పత్రిక అంటించారు. కానీ వేలం తేదీని ఇంకా ఎక్కువగా ప్రచారం చేసే వ్యాపారస్తులు అధిక సంఖ్యలో వస్తారని ముస్లిం సోదరులు తెలుపుతున్నారు. ఈ ఏడాది హరీష్ -హలీం దుకాణాల వేలం పాట ఎంతకు దక్కించుకుంటరో వేచి చూడాల్సిందే.
నేడు ఉర్దూఘర్ షాదీఖానా హారిస్-హలీం దుకాణాల వేలం
ప్రతి సంవత్సరం రంజాన్ మాసం షాధీఖానాలో ఏర్పాటు చేసే హరీష్-హలీం దుకాణాల కోసం వేలం పాట శనివారం ఉదయం 9.30 గంటలకు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ వేలం పాట ఖమ్మం ఆర్డీఓ అధికారి సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ టెండర్ ప్రక్రియ కోసం అధికారులు పనులు పూర్తి చేశారు.