నిద్రపోతున్న నిఘా నేత్రాలు..

ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే కార్యకలాపాలను చిత్రీకరించే నిఘా

Update: 2025-01-10 05:12 GMT

దిశ, వైరా : ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే కార్యకలాపాలను చిత్రీకరించే నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. మూడేళ్లుగా ఆ నిఘా నేత్రాలు పనిచేయకపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. నిఘా నేత్రాల నిఘా లేకపోవడంతో ఆ కార్యాలయంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతుంది. నిఘా నేత్రాలు పనిచేయటంలేదని నెల రోజుల క్రితం దిశ వార్తా కథనాల రూపంలో విషయాన్ని బహిర్గతం చేసింది. అయినప్పటికీ ఉన్నతాధికారులకు ఇదంతా మామూలుగానే మారింది. కనీసం ఉన్నతాధికారులు నిఘానేత్రాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ కార్యాలయంలో అధికారితో పాటు హమాలీలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇది వైరాలోని మూడు మండలాలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎం ఎల్ ఎస్ పాయింట్ దుస్థితి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ లో గత మూడు సంవత్సరాలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.

దీంతో ఇక్కడ ఓ అధికారి ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తి పర్యవేక్షణలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ విషయమై గత నెల రోజుల క్రితం దిశ దినపత్రికలో అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే అధికారులు తూతూమంత్రంగా విచారణ నిర్వహించి చేతులు దులుపుతున్నారు. కానీ మూడు సంవత్సరాలుగా పనిచేయని సీసీ కెమెరాలను పునరుద్ధరించలేదు. దీంతో ఇక్కడ అవినీతి అక్రమాలు యధా మాములుగానే కొనసాగుతున్నాయి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వైరా కొణిజర్ల తల్లాడ మండలాల్లోని రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ కేంద్రంలో రేషన్ డీలర్లకు సన్న బియ్యం కేటాయించే విషయంలో అక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇక్కడ పనిచేసే ఓ అధికారి ప్రైవేటు వ్యక్తి సహాయంతో తమకు నగదు ఇచ్చిన డీలర్లకు సన్న బియ్యం కేటాయిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఎఫ్సీఐ నుంచి లారీల్లో వచ్చిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముల్లో దింపకుండా నేరుగా డీలర్లకు పంపేందుకు మరో లారీల్లో తిరగగొడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ నుంచి వచ్చిన బియ్యాన్ని కాటా వేసి డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటా అలంకారప్రాయంగా మారింది. కాటా వేయకుండానే నేరుగా డీలర్లకు రేషన్ బియ్యం బస్తాలను లారీల్లో లోడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే హమాలీలు మాత్రం కాటా వేస్తున్నట్లు బిల్లులు తీసుకోవడం విశేషం. ఇంత జరుగుతున్నా ఇక్కడ పనిచేసే ఓ అధికారి కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాయింట్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అవినీతి అక్రమాలు చేసేందుకు మరింత ఊతమిస్తుంది. నెల రోజుల క్రితం ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం తెలిసినా ఉన్నతాధికారులు నేటి వరకు వాటి గురించి పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రైవేటు వ్యక్తి చేతుల కబంధ హస్తాల్లో ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వహిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే

ఇక్కడ హమాలీలు పెద్ద ముదుర్లు : లింగమూర్తి, ఎంఎల్ ఎస్ పాయింట్ ఆర్ఐ

ఎంఎల్ఎస్ పాయింట్లో పనిచేసే హమాలీలు పెద్ద ముదుర్లు.... వాళ్లు మాట వినేటట్టు ఉన్నారా.... బియ్యం బస్తాలను కాటా వేయమని మీరు ఒకసారి హమాలీలతో మాట్లాడండి.... ప్రతి బియ్యం బస్తాను కాటా వేయాలని హమాలీలకు డిఎం మేడం తో చెప్పిస్తా.... డీలర్లు అంగీకరిస్తేనే బియ్యం బస్తాలను కాటా వేయకుండా లారీల్లో వారికి పంపుతున్నాం. డీలర్లు కాటా వేయాలని పట్టుపడితే బియ్యం బస్తాలను కాటా వేస్తున్నాం. దిశలో వార్తా కథనాలు వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసే ప్రైవేటు వ్యక్తిని తొలగించాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నాకే మంచిది. నాకు సీసీ కెమెరాలు పని చేస్తే సేఫ్ సైడ్ గా ఉంటుంది.


Similar News