ఆక్రమిస్తాం.. అడిగేవారెవరు..? వైరా‌లో రోడ్డు ఆక్రమణల పర్వం

ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Update: 2024-07-17 03:22 GMT

దిశ, ఖమ్మం: ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. కార్పొరేషన్ మంజూరు చేసిన పర్మిషన్లకు.. నిర్మిస్తున్న భవనాలకు పొంతన లేకుండా ఉంటోంది. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు పాత ఎల్ఐసీ కార్యాలయం కూతవేటు దూరంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులకు పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణం జరిగినట్లు సమాచారం. ఇటీవలే ఆ అంతస్తులో జోస్ అలుక్కాస్ ఆభరణాల షోరూం‌ను ప్రారంభించారు. నిర్మాణం చేసేటప్పుడు సేట్ బ్యాక్ లేకుండా ఇష్టానుసారం‌గా నిర్మాణం చేయడంతో ట్రాఫిక్ అంతరాలు చోటుచేసుకుంటున్నాయి. వైరా రోడ్డులో గతంలో పాదాచారుల కోసం ఫుట్‌పాత్ నిర్మాణం చేస్తే దాన్ని కూడా కబ్జా చేసి షో‌రూం కింద వాడుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది.

సెల్లార్ లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం..

ఖమ్మం నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణం బిల్డింగ్ యాజమానులు ఇష్టానుసారంగా నిర్మాణం చేస్తున్నారు. 750 గజాలు స్థలముంటే దానికి సెల్లార్ పర్మిషన్ కార్పొరేషన్ ఇస్తుంది. 750 గజాల కంటే తక్కువగా ఉంటే సెట్ బ్యాక్ ఇస్తూ పర్మిషన్ ఇస్తున్నారు. కానీ, నిర్మాణం మాత్రం సేట్ బ్యాక్‌ను వదలకుండా నిర్మాణాలను చేపట్టడంతో భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత అంతరాయం కలుగుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. వైరా రోడ్డులో నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం చేస్తూ వెనుక భాగంలో రోడ్లను ఆక్రమిస్తున్నారు. ముందు భాగం, వెనుక భాగంలో డ్రైనేజ్ కాలువను కూడా వదలడం లేదు.

తిరుమల థియేటర్ లైన్‌లో బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించిన పెద్ద పెద్ద జనరేటర్లు ఏర్పాటు చేసి డ్రైనేజీ కాలువలపై నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాణం చేసిన జువెలరీ షోరూం బిల్డింగ్ కూడా వెనుక భాగంలో డ్రైనేజ్ కాలువను కబ్జా చేసి జనరేటర్లను ఏర్పాటు చేశారు. బహుశా అంతస్తుల నిర్మాణం చేస్తున్న సమయంలో కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం సమయంలో స్థానిక కార్పొరేటర్లను కూడా మేనేజ్ చేసి నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల థియేటర్ రోడ్డులో డ్రైనేజీలపై ట్రాన్స్‌ఫార్మర్స్, జనరేటర్లు ఏర్పాటు చేయడంతో ఆ రోడ్డు ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్‌తో వానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చోద్యం చూస్తున్న కార్పొరేషన్ అధికారులు..

ఖమ్మం నగరంలో నిర్మాణం అవుతున్న బహుళ అంతస్తుల నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా కట్టడి చేయటంలో కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఆరు నెలల పాటు వైరా రోడ్డులో నిర్మాణం చేస్తున్న బిల్డింగ్ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని తెలుస్తోంది. కొందరు కార్పొరేషన్ సిబ్బంది నిర్మాణాదారులతో కుమ్మక్కై చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా కొర్పొరేషన్ కమిషనర్ దృష్టి సారించి నిర్మించే బిల్డింగులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి: వసుంధర, అసిస్టెంట్ సిటీ ప్లానర్

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యజమానులు తప్పకుండా కార్పొరేషన్ పర్మిషన్ల అనుగుణంగా నిర్మాణం చేపట్టాలి. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం చేస్తే చర్యలు తప్పవు. డ్రైనే‌జ్ కాలువలు అక్రమాల చేసి నిర్మాణం చేసే చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడ డీవియేట్ అయ్యాయో చూసి నోటీసులు అందిస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకుంటాం.


Similar News