Don't care : కలెక్టర్ తిట్టినా డోంట్​కేర్​

ఆర్టీసీ (RTC)ఆస్తులను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు కొంతమంది వ్యాపారస్తులు.

Update: 2024-11-01 10:22 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఆర్టీసీ (RTC)ఆస్తులను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు కొంతమంది వ్యాపారస్తులు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో వ్యాపారం చేసుకుంటూ నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణను కస్టమర్ల పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్టాండ్ లో మరే ఇతర వాహనాలు రాకూడదని, ఒకవేళ వచ్చినా ప్రయాణికుల సౌలభ్యం కోసమే రావాలని ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆర్టీసీ కాంప్లెక్స్ (RTC Complex)లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కొంతమంది బస్టాండ్​ను తమ పార్కింగ్ స్థలంలా వాడుకుంటున్నారు.

    కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్ లో హోటల్ మధువన్ ఈ కోవకు చెందిందని చెప్పవచ్చు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో రూములను అద్దెకు తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న మధువన్ యాజమాన్యం ఆర్టీసీ స్థలాలను అడ్డంగా వాడుకుంటుంది. నిత్యం రద్దీగా ఉన్న ఈ హోటల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న పార్కింగ్ ను వాడుకోవాల్సింది పోయి బస్టాండ్ లోపల వైపు ఉన్న స్థలాన్ని అందుకు ఉపయోగించుకుంటుంది. గతంలో కలెక్టర్ వితేష్ వి పాటిల్ (Collector Vitesh V Patil)ఆకస్మిక పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ లో ప్రైవేటు వాహనాల పార్కింగ్ పై డిపో అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

    ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ఒకవేళ అయితే డిపో అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అనంతరం నాలుగు రోజులు హడావుడి చేసి ఇప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలు నిలిపితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ మధువన్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఈ అంశంపై సీరియస్ గా ఉన్నప్పటికీ డిపో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది.  

Tags:    

Similar News