నో.. కన్వర్షన్.. నో పర్మీషన్ !

సామన్యుడు ఏదైనా ఇళ్లు నిర్మించుకుంటే టక్కున వాలిపోయే పంచాయతీ అధికారులు పెద్ద స్థాయిలో ఓ ఇండస్ట్రీ నిర్మించి నడిపిస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారు.

Update: 2024-09-20 04:23 GMT

దిశ, ఖమ్మం రూరల్ : సామన్యుడు ఏదైనా ఇళ్లు నిర్మించుకుంటే టక్కున వాలిపోయే పంచాయతీ అధికారులు పెద్ద స్థాయిలో ఓ ఇండస్ట్రీ నిర్మించి నడిపిస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన లక్షల రుపాయల ఫీజుకు ఎగనామం పెట్టి యథేచ్ఛగా సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ నడుపుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇండస్ట్రియల్ శాఖ, పంచాయతీ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెట్టిన కంపెనీ నిర్వహకులకు కనీసం నోటీసు కూడా పంపిన సంఘటనలు కూడా లేవు. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి ఇలాఖాలొనే ఇంత పెద్ద అక్రమానికి తెరలేపిన మహాఘనులు ఎవరనేది అధికారులే తెల్చాల్సి ఉంది.

ఎదైనా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ( కన్వర్షన్) భూమిగా మార్చాలి. తర్వాత టీఎస్ ఐపాస్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని అనుమతి పొంది పరిశ్రమల శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇండస్ట్రీ నిర్మించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఇక్కడ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. రూరల్ మండలం ముత్తగూడెం రెవెన్యూ పరిధిలోని గొల్లగూడెం సమీపంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. సుమారు 5 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండంతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించిన సరైన అనుమతులు లేవని తెలిసింది. తాత్కలిక అనుమతి పేరుతో విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకుని లక్షల రుపాయలకు ఎగనామం పెడుతున్నారు. ఇక్కడ సింగిల్ ఫేస్ కూడా వినియోగిస్తున్నారు. దానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయో ఆ శాఖకు చెందిన అధికారులే తెలియాల్సి ఉంది. ఇన్ని శాఖల నుంచి అనుమతులు పొందకుండా యధేచ్ఛగా ఇండస్ట్రీ రన్ చేస్తుంటే అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడంలేదనే దాని పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

యథేచ్ఛగా భారీగా సిమెంట్ పైపుల ఇండస్ట్రీ నిర్వహణ..

హైద్రాబాద్ కు చెందిన ఓ గుత్తేదారుకు చెందిన సంస్థ ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా సిమెంట్ పైపుల ఇండస్ట్రీ నిర్వహిస్తున్నారు. గుత్తేదారు అంటే చాలు అధికారులు వారికి ఎటువంటి అనుమతులు లేకున్నా అన్ని రకాల ధ్రువపత్రాలు ఇవ్వడం అలవాటుగా మారింది. పంచాయతీ అధికారులైన ఎంపీవో, కార్యదర్శులు ఇటువంటి అక్రమ నిర్మాణల పై కన్నెత్తి కూడా చూడరని, సామన్యుడు ఇల్లు నిర్మించుకుంటే మాత్రం దానిని కూల్చి వేసేంతవరకు నిద్రపోరని, ఒక వేళ అనుమతి కోసం వెలితే సవాలక్ష రూల్స్తో తిప్పుకుంటారని ప్రజలు విమర్శిస్తున్నారు. పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం ఆఫీస్ కే పరిమితమై అక్కడ కాగితాల్లోనే చూసుకుని ‘మామూళ్ల’తో సరిపుచ్చుతున్నారు.

పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు..

పంచాయతీ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ గొల్లగూడెం పంచాయతీ పరిధిలో నిర్మించిన సిమెంట్ పైపులు ఫ్యాక్టరీ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అది తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. సదరు కంపెనీకి నోటీసులు పంపిణీ చేసి చర్యల పై అధికారులకు విషయాన్ని తెలియజేస్తాం అంటున్నారు.


Similar News